Saturday, June 16, 2012

పాఠము – 5. తెలివితేటలు, ఆలోచనా సామర్ధ్యము, బుద్ధి బలము

పాఠము5. తెలివితేటలు, ఆలోచనా సామర్ధ్యము, బుద్ధి బలము

5.1  తెలివితేటలలో నాణ్యతను  ఎలా పెంచుకోవాలి? ఎలా ఉపయోగపడాలి?



5 .1 .1 శరీర బలం కన్నా బుద్ధి బలం గొప్పది . బుద్ధి బలం తో మనిషి అనేక అద్భుతాలను సృష్టించగలడు. దేశాన్ని అనేక సమస్యలనుండి రక్షించడానికి బుద్ధి బలం కల నిస్వార్ధ యువత కావాలి. తమ తెలివి తేటలతో,చాకచక్యంగా, చతురతతో సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకాలి. అది అందరూ సాధించ గలిగినదే. దాని కొరకు చేయాలనే కోరిక నిరంతర పరిశ్రమ, సాధన అవసరము. అవి అలవాటు చేసుకొన్న ప్రతి ఒక్కరికి బుద్ధిబలం అందుబాటు లోకి వస్తుంది. అటువంటి వ్యక్తులతో ఈ దేశం నిండాలి.

5 .1 .2 ఆలోచించే విధానము, జ్ఞాపకము ఉంచుకునే శక్తి, మాట్లాడే పధ్ధతి, విశ్లేషణ చేసే దృక్పథము మరియు విజ్ఞానాన్ని నేర్చుకునే కోరిక వీటన్నింటిని నిరంతరమూ మెరుగు పరచుకుంటూ నడిచే మనిషి తను తలపెట్టిన ప్రతి పనిని అత్యంత సామర్ధ్యం తో నిర్వహిస్తాడు.

5.1.3 మనిషికున్న ఈ ప్రకృతి వరాలను దైవ దత్తమైన శక్తులను తెలుసుకుని పెంపొందించుకుంటూ జీవించే మనుషులు తమ మీద తాము అమితమైన విశ్వాసముతో క్లిష్టమైన కార్యాలను సాధించగలుగుతారు. వారు ఈ సమాజ స్థితిగతులను మార్చగలరు. వీరు చరిత్రను సృష్టించగలరు. వారు అపరిష్కృత సమస్యలకు అందమైన సమాధానాలను చూపగలరు.

5.1.4 మనిషికున్న ఆలోచనా శక్తి వాడే కొద్ది పెరుగుతుంది. మనవి కాని సమస్యలను కూడా మనము అలోచించి పరిష్కారాన్ని చూపవచ్చును. జీవితాన్ని మెరుగుపరచే మనుషులను తయారు చేసే వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దే ఆలోచనలు, ప్రయోగాలు ఈ దేశానికి చాల అవసరము. అటువంటి విధానాలు బుద్ధి బలమున్న నవ యువకులకే సాధ్యము.

5.1.5 బుద్ధి బలమున్న తెలివి తేటలున్న వ్యక్తులు తాము పుట్టిన పరిస్థితులతో సంబంధం లేకుండా నిరంతరమూ ఉత్తెజితులు అవుతూ తమ సామర్ధ్యాన్ని వాడుతూ గొప్ప గొప్ప విషయాలను సాధిస్తూ ఎవరూ చూడని నడవని కొత్త బాటలలో నడిచి వినూత్న ఫలితాలను సాధిస్తారు.

5.1.6 విన్నుత్నముగా ఆలోచించడము, ఎల్లప్పుడు సమస్యలకు పరిష్కారం వైపు చిత్త శుద్ధి తో ఆలోచించడము, నిస్పక్షపాతం గా వ్యవహరించడం, తను చేయబోయే కార్యక్రమము పై చెరిగి పోని నమ్మకము మనిషిని అజేయునిగా, బుద్ధి బలము ఉపయోగించుకునేట్లు చేస్తాయి.

5.1.7 ప్రజలు వారు సాధించిన విజయాలను చూస్తారు. కానీ, అ విజయం వెనుక వారు చేసిన సాధన, కృషి, నిరంతర శ్రమ వారికి కానరావు. తెలివి తేటలు సక్రమంగా ఉపయోగించుకునే దారిలో వారు తమను తాము ముందుకు నడుపుకొంటారు. ప్రోత్సహించుకొంటారు.

5.1.8 మన ఎదురుగా ఉన్న సమస్యకు నూతన విధానములో పరిష్కారము వెదుకుట ద్వారా మన ఆలోచనా సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చును. మన మెదడు ఆలోచించేకొద్ది దానిని అలవాటుగా మార్చుకుని సృజనాత్మకత తో ముందుకు నడుస్తుంది. ఆశ్చర్యకరమైన సూచనలు చేస్తుంది.

5.1.9 తెలివి తేటలు, బుద్ధి బలము పెరగటానికి మానసిక ప్రశాంతత అవసరము. తన గురించే కాక తన తోటి వారి గురించి ఆలోచించే విశాల దృక్పధము అవసరము. దీని కొరకు ధ్యానము ఉపయోగపడుతుంది. సరి అయిన ఆసనములో కదలకుండా కూర్చుని మన శ్వాస మీద ధ్యాస తో 15 నిముషాలు కూర్చున్నప్పుడు మన మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

5.1.10 ఒక సమస్యకు అనేక రకాల పరిష్కారాలు ఉంటాయి. సమస్యను మనము మనసులోకి తీసుకుని ఏకాగ్రతతో విశ్లేషణ చేసినపుడు తప్పని సరిగా పరిష్కారము లభిస్తుంది. ఆ ప్రయాణములో మన బుద్ది బలము వికసిస్తుంది. పెద్ద పెద్ద పనులను పూర్తి చేసే సామర్ధ్యము పొందుతాము. మన మెదడును విలాసాలతో, అనాసక్తితో ఖాలీగా ఉంచినపుడు అది తన శక్తి ని కోల్పోతుంది. అప్పుడు ఆలోచించడం అనేదే మర్చిపోయి గుడ్డిగా జీవితాన్ని గడుపుతాము. ప్రతి విషయాన్ని దీర్ఘకాలిక ఫలితాలను దృష్టి లో ఉంచుకుని విశాలదృష్టి తో, సంపూర్ణ విశ్వాసంతో నిరంతర శోధన తో అనుక్షణము వినూత్న విధానాలతో చూసే, ప్రవర్తించే, నడిచే వ్యక్తి తన తెలివి తేటలను దిన దిన ప్రవర్ధమానం గా పెంచుకుని అవకాశాలు సృష్టించగలడు. గొప్ప నాయకునిగా ఎదగ గలుగుతాడు. మార్పు తీసుకు రాగలుగుతాడు.



5.2. జ్ఞాపక శక్తిని పెంచుకోవడం ఎలా ?

5.2.1 మనుషులందరికీ ఒకే నాణ్యత ఉన్న ఒకే రకమైన శక్తి సామర్ధ్యాలు ఉన్న మెదడు ఉంది. కాని దానిని వాడుకునే విధానము తెలిసిన వారికి అనంతమైన జ్ఞాపకశక్తి అందుబాటులోకి వస్తుంది. దానికి కొన్ని విధానాలు అలవాట్లు పాటించాలి.

5.2.2 నాకు చాల మంచి జ్ఞాపక శక్తి ఉంది అని మీరు నమ్మాలి. అలా కాకుండా నాకు జ్ఞాపక శక్తి లేదు అని మీరు భావిస్తే క్రమక్రమముగా మీరు ఆ శక్తిని కోల్పోతారు. మీరు అనుక్షణము మీ జ్ఞాపక శక్తిని పెంచుకునే దృక్పధము తో అనేక విషయాలను చదివి గుర్తుంచుకోడానికి ప్రయత్నించాలి.

5.2.3 మనము గుర్తు పెట్టుకోవలసిన నంబర్లకు, పేర్లకు, సంఘటనలకు ఎదైన ప్రసిద్ధి పొందిన పేరునుగాని, కుదించిన అక్షరాలను కానీ, మరేదైనా కలిపి గుర్తు పెట్టుకున్నప్పుడు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఉదాహరణకి "క్విట్ ఇండియా ఉద్యమము ఆగష్ట్, 1942 న గాంధీజీ ముంబాయి లో, గోవలియ టాంకు మైదాన్ లో పిలుపునిచ్చారు." పై వాక్యము గుర్తు పెట్టుకోవాలంటే "క్వి 8/42 గాంధీజీ ముంగోటమై" అనే పదాన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనము చాల క్లిష్టమైన వాక్యాలను, సంఘటనలను గుర్తు పెట్టుకోవచ్చు.

5.2.4 మీరు గుర్తు పెట్టుకోవలసిన వస్తువులు, విషయాలతో కలిపి ఒక చిన్న కథను మీ సొంత పదాలతో అల్లినప్పుడు కూడా అ విషయాలను మనము గుర్తు పెట్టుకోవటము సులభతరము.

5.2.5 మనము తెలుసుకొన్న విషయాన్ని నిజజీవితంలో, జరిగే విధానము అక్కడ ఉండే పరిస్తితులు, మీరు ప్రత్యక్షం గా వీక్షించ గలిగే చిత్రాలు కలిపి ఉహించుకుని చూడగలిగినప్పుడు కూడా మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే మనం చూసిన దానిని ఎక్కువగా గుర్తుంచుకోగలము. మన మెదడుకు చిత్రాలను గుర్తుంచుకునే శక్తి ఉంది. అనేక వస్తువులు, అనేక అంకెలున్న నంబరు మొదలైనవి గుర్తుపెట్టుకోవాలంటే వాటిని చిన్న చిన్న అర్ధవంతమైన విభాగాలుగా విభజించినపుడు అందులో ఉన్న వస్తువులను గుర్తు పెట్టుకోవటము తేలిక . మనము విభజించే విధానము మన జ్ఞాపక శక్తి కి అనుకూలంగా ఉండాలి.

5.2.6 నీవు గుర్తుంచు కోవలసిన విషయాన్ని మరల మరల గుర్తు చేసుకోవడం, రోజుకోసారి, వారానికోసారి, నెలకొకసారి అలా కాల పట్టిక ప్రకారం నిర్ణయించుకుని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ విధం గా చేసినపుడు నీకు సహజం గా ఆ ప్రతిభ పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

5.2.7 మనము గుర్తుంచుకోవలసిన విషయాలను ఆకట్టు కునే పదాలు, అర్ధము వచ్చే పదాలు, చూడగానే అంతా గుర్తుకు వచ్చే విధమైన పదాలు వ్రాసుకుని చిన్న చిన్న కార్డులపై ఉంచుకుని వాటిని చదివి మిగతా విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నించాలి. అప్పుడు మనము మన మెదడు యొక్క పనితనాన్ని పెంచ గలుగుతాము.

5.2.8 మనము పరీక్షలో వ్రాయవలసిన పాఠ్య అంశాలను ముందుగా ఒక ప్రణాళిక ప్రకారము చదువుకోవాలి. మన మెదడు కు విషయాలను అర్ధం చేసుకుని నిలవ ఉంచుకోవటానికి కావలసిన సమయాన్ని ఇవ్వాలి. పరిక్షలముందు హడావిడి గా చదివితే కొత్త విషయాలను మన మెదడు గుర్తుంచుకోలేదు. ఒక ప్రణాళిక ప్రకారము ముందుకు కదలాలి.

5.2.9 మనకు సంబంధించిన ప్రతి వస్తువును ఒక నిర్దిష్టమైన ప్రదేశం లో ఉంచి వాడిన తర్వాత దానిని తిరిగి అదే ప్రదేశం లో ఉంచడము మన పుస్తకాలు, పేపర్లు, ఇంటిలో ఉండే అన్ని రకాల వస్తువులను ఒక పధ్ధతి ప్రకారము ఒక స్థలము లో క్రమబద్ధం గా ఉంచినపుడు మనకు అవి అందుబాటు లో ఉంటాయి. ఏ వస్తువును మనం మరచిపోము. మనకు అది ఒక అలవాటు గా మారుతుంది. సరి అయిన సమయమునకు అవసరమైనవి అందుబాటు లో ఉంటాయి. మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

5.2.10 మనము ఏ విషయాన్నైనా చదివేటప్పుడు, నిదానముగా లోతుగా ప్రాణాయామాన్ని చేసినపుడు మన ఏకాగ్రత పెరుగుతుంది. ఉపిరి తిత్తుల నిండా గాలిని పీల్చి అక్సిజనును బాగా ఆస్వాదించాలి. మన మెదడుకు సామర్ధ్యాన్ని పెంచే పజిల్సు, ఆటలు, మెదడుకు మేత, సామెతలు, పొడుపు కథలు ప్రయత్నించాలి. మెదడు శక్తిని వాడకపోతే క్రమ క్రమం గా అది ఆ శక్తి ని కోల్పోతుంది.



5.3 సృజనాత్మకత ను పెంచుకోవడం ఎలా?

5.3.1 సృజనాత్మకత అంటే ఇంతకూ ముందు అందుబాటులో లేని వస్తువును, పదతిని, కొత్త విషయాన్ని, విధానాన్ని కనుగొనటం. దానిని పది మందికి అందుబాటులోనికి తేవటం. ఈ ప్రపంచంలో జరిగే అభివృద్ధి అంతా సృజనాత్మకత ఉన్న వ్యక్తుల వలెనే సాధ్యము. అందరికి ఈ సృజనాత్మకత ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే దానిని వినియోగించి గొప్ప విషయాలు సాధిస్తున్నారు. కొన్ని ప్రయత్నాలు చేస్తే అందరు సృజనాత్మకత ను సాధించవచ్చును.

5.3.2 సృజనాత్మకత అనేది మనకు మనము చేసుకోవలసిన అలవాటు, దృక్పథము, భావన, ప్రయత్నము, ఆలోచన. అంటే ముందు మనము సృజనాత్మకంగా ఉండాలి అని నిర్ణయించుకోవాలి. మనము చేసే ప్రతి పనిని అదే భావన తో చేయాలి. అదే ఉద్దేశంతో అభివృద్ధి చేసే కోణం లో ఆలోచించాలి. మనకు కనపడిన ప్రతి సమస్యకు సమాధానాన్ని సాధించాలి.

5.3.3 మనము చూస్తున్న ప్రతి వస్తువు, పధ్ధతి, దారి, విధానము ఇంకా మెరుగైన పధ్ధతిలో చేయవచ్చని, అటువంటి అవకాశం ఉందని మనము ప్రయత్నము చేసినపుడు ఫలితము లభిస్తుందని భావించాలి. ఆ దిశగా మన మెదడును ప్రశ్నించాలి. ఇతరులతో సంభాషించాలి.

5.3.4 మనము ఏదైనా నిర్ణయము తీసుకునే ముందు లేదా ఏ విషయాన్నైనా మెరుగు పరచాలని భావించినపుడు దాని కొరకు మనముందున్న అనేక మార్గాలను తెలుసుకోవాలి. వాటిని విశ్లేషించాలి. వాటి ఫలితాలను అంచనా వేయాలి. ఆ విధంగా ఆలోచించినపుడు మనకు తెలియకుండానే మెరుగైన పద్ధతిని కనిపెట్టవచును. ఉదాహరణకు అన్న హజారే, రాలే గావ్ సిద్ధి అనే తన ఊరిలో నీరు లేక ప్రజలు వలస పోవటాన్ని గమనించి చెక్ డాముల ద్వారా నీటి నిల్వను పెంచవచ్చని గుర్తించి ప్రయోగము చేసి అ గ్రామాన్ని సస్యశ్యామలంగా మార్చాడు. అంతకు ముందు అసాధ్యం అనుకొన్న దానిని చేసి నిరూపించాడు.

5.3.5 మనము మన మెదడును నిశితంగా ప్రశ్నించినపుడు అది స్పందించి సృజనాత్మకమైన సలహాలను ఇస్తుంది. కాలక్రమములో అది ఒక అలవాటుగా మారుతుంది. మన వ్యక్తిగత, సామాజిక సమస్యలను దీని ద్వారా పరిష్కరించవచ్చును.

5.3.6 మనము సృజనాత్మకత ను పెంచుకోవటానికి తర్కమును పెంచుకోవాలి. ఒక విషయానికి ఇంకొక విషయాన్ని కలిపి ఆలోచించడం పెంచుకోవాలి. అది అలానే ఎందుకు జరిగింది, ఇంకొక పధ్ధతి లో జరిగే విధానము ఏమైనా ఉందా, దానిని ఎలా అర్ధము చేసుకోవాలి, ఇతర పరిస్థితులలో ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇలాంటి ప్రశ్నలతో మన మెదడు ను ప్రశ్నించినపుడు అనుకోని వినూత్న సమాధానాలు మనకు లభిస్తాయి.

5.3.7 మనము అలోచించి కొత్త ఉపాయాలను వెలికి తీయటము ప్రారంభించినపుడు, మనము ప్రతిపాదించిన చిన్న విషయాలలో మనము విజయము సాధించినపుడు మనకు అది ఒక అలవాటుగా మారుతుంది. మన మెదడు కొత్త కొత్త ఉపయోగాలను అందించే ఉపాయాలను అందిస్తుంది.

5.3.8 సమస్య మన వ్యక్తిగతము కాకపోయినా మనకు వీలు కుదిరినపుడు మనకు ఎదురయ్యే అన్ని రకాల క్లిష్ట విషయాలను స్వీకరించి విశ్లేషించటం మొదలుపెట్టాలి. పది మందితో కలిసి సాంఘిక పరిష్కారము కొరకు చర్చలు జరపాలి. ఇతరుల వద్దనుండి వచ్చే ఉపాయాలలోని మంచి విషయాలను మన ఉపాయం లో కలిపి చూడాలి. అ ప్రయత్నము లో అనేక మంది నుండి వచ్చిన ఇతర విషయాల తో కలిసి ఎవరూ ఉహించని గొప్ప విధానాలను వెలికి తీసే అవకాశం ఉంది.

5.3.9 మెదడు యొక్క ఆరోగ్యము, ఆనందము కూడా సృజనాత్మకతకు అవసరము. మానసిక ఒత్తిడి, ఆందోళన, భయాలు, అపోహలున్న మెదడు సృజనాత్మకత తో ఉండజాలదు. దాని కొరకు మెదడు ఆరోగ్య అభివృద్ధి, సంగీతము, నృత్యము, కవిత్వము, లలిత కళలు, ప్రాణాయామము, ధ్యానము తోడ్పడతాయి. అటువంటి అలవాట్ల వలన మెదడు పనితీరు, సృజనాత్మకత పెరుగుతుంది.

5.3.10 సృజనాత్మకత ఒక్క రోజులో అర్ధమయ్యే సాధించే నైపుణ్యము కాదు. దానికి సరి అయిన అవకాశము, ఆలోచన, అనుభవము కావాలి. మనిషి మెదడు సాధన చేసే కొద్ది పదును ఎక్కి క్రమంగా అందుబాటులోనికి వచ్చి మంచి నాణ్యతను పొందుతుంది. సృజనాత్మకతను పట్టించుకోకుండా ఇతరులను అనుసరించి జీవించే అవకాశం ఉంది. అదే సుఖమని చాలా మంది భావిస్తారు. అలా ఆలోచించడము కష్టమని భావిస్తారు. కాని సృజనాత్మకత మనకు మెరుగైన జీవితాన్ని, మన భావనలలో మెరుగైన చురుకుదనాన్ని పదిమందిలో గుర్తింపును, మన చుట్టూ ఉన్న అనేక సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది. అందువలన దీనిని అందరు పాటించడము అవసరము.



5.4 ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవటం ఎలా?

5.4.1 మన మీద మన బలము పైన మనము సాదించగల పనులపైన మనకు ఉండే విశ్వాసాన్ని ఆత్మ విశ్వాసం అంటారు..నేను చేయగలను నేను సాదిస్తాను నేను ముందుకు వెళతాను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అనే మాటలు ఆత్మ విశ్వాసమున్న వ్యక్తి వద్ద నుండి వస్తాయి.అది లేని వ్యక్తి తను చేయలేనని నమ్ముతాడు..మన నమ్మకాలే మన నిజ జీవితం లో ప్రతిబింబిస్తాయి. అందువలన మనము ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవటం అత్యంత ఆవశ్యకం.

5.4.2 అటువంటి ఉన్నతమైన లక్షణాన్ని సాధించటం అందరికీ ఆవశ్యకము ప్రయత్నిస్తే అందరికి సాద్యము..మొదటి అడుగు గా మనము దేని గురించి భయపడుతున్నాము అనేది గుర్తించాలి మనము లేవని బావించే మనలో మనకు తక్కువ అనిపించే లక్షణాలను గుర్తించి వాటిని నేర్చుకోవాలనే కోరికను లేదా సరిదిద్దుకోవాలనే ఆలోచనను పెంచుకోవాలి అవి మనలో ఎందుకు తగ్గాయి అవి నిజంగానే మన బలహీనతలా లేక మనమే అనవసర ఆలోచనలతో సతమత మౌతున్నామా అన్న విషయాన్ని విశ్లేషించి గుర్తించాలి.

5.4.3 మనము బాధ పడుతున్న విషయాలను చేయలేమని భావిస్తున్న విషయాల గురించి మీ స్నేహితులతో అనుభవమున్న పెద్దలతో నీ మంచి కోరే వారితో చర్చించి వాటిని ఆదిగమించటానికి వారి సలహాలను తీసుకోవాలి.మనలను మనము ప్రేమించటం అలవాటు చేసుకోవాలి మనము మార్చలేని విషయాల గురించి అనవసరమైన ఆందోళన ను తొలగించుకోవాలి మనము సాదించాలి అనుకొంటున్నపనులను ఇంతకూ ముందు సాదించిన వారిని కలిసి వారు ఎలా సాదిన్చారో తెలుసుకోవాలి..వారు సాదించినపుడు మనము కూడా సాదించ గలము అని నమ్మాలి ఆ దిశగా ప్రయత్నము చేయాలి.

5.4.4 ఎవరూ పుడుతూనే గొప్ప వారిగా జన్మించరు.గొప్ప గొప్ప విషయాలను సాదించిన వారు కూడా నిరంతర ప్రయత్నము ఎన్నో వోటమిల అనంతరము విజయాలు పొందారని గుర్తించాలి. ఎవరూ ఏ పనినైనా మొదలు పెట్టిన వెంటనే పూర్తి చేయలేక పోవచ్చు కానీ ఏకాగ్రతతో చేయాలనే తపనతో చేస్తే సాదించగలరు అనే నమ్మకాన్ని బలంగా మనలో నింపుకొని మనకు ఎదురయ్యే ఓటమిని విశ్లేషిస్తూ కొత్త పదకాలతో ముందు నడిచే యోచనను అనుక్షణము ఆచరించాలి.

5.4.5 ప్రతి మనిషి లోను కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి. నీలో అటువంటి గొప్ప లక్షణాలు ఏమిటి అని విశ్లేషించి తెలుసుకోవాలి. నీవు ఇష్ట పడేవి ఏమిటి, నీవు బాగా చేయ గలిగేవి ఏమిటి అనేవి తెలుసుకొని వాటిని ఇంకా అబివృద్ది చేసుకొని వాటి ద్వారా నీకు మంచి గుర్తింపు వచ్చే దారిలో ప్రయత్నము చేయాలి వాటిని నిరంతరము అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నించాలి..అలా చేసినప్పుడు అంతర్గతముగా నీపై నీకు విశ్వాసము పెరిగి కొత్త పనులు చేయటానికి కావలసిన మానసిక సంసిద్దత పెరుతుంది. కార్య దీక్ష పెరుగుతుంది.

5.4.6 నీ మీద నీవు జాలి పడటము, నీవు చేయలేని వాటిగురించి బయపడుతూ వాటికి దూరంగా పారిపోవటం, నీవు బలహీనుడవని నీవే ఇతరులకు చెప్పటం, నీ మీద ఇతరులు జాలి పడాలని నీకు అందరూ సహాయము చేయాలని ఎవరు నిన్ను కాపాడతారా అని ఎదురు చూడటము, అకస్మాత్తు గా సిరి సంపదలు పొందాలని ఆశించటం, కనపడిన దేవుల్లందరికి మొక్కుకోవటం జాతకాలు వాస్తు అదృష్ట రేఖలు మొదలైన వాటిని గుడ్డిగా నమ్మి వాటి గురించి అనేక రకాల పనులతో సమయాన్ని వాటితో గడపటం అనే అలవాట్ల నుండి బయటపడాలి.

5.4.7 నీవు బయపడే పనులను మరల మరలా చేయటం ద్వారా నీలో కొంచెము కొంచెముగా భయము పోయి దైర్యము పెరుగుతుంది. ఎప్పుడు ఆనందముగా ఉండటానికి, నీగురించి నీవు సంతృప్తిగా ఉండటానికి ప్రాదాన్యత ఇవ్వాలి. అద్దము ముందు నిలబడి నీలో ఉన్న గొప్ప గుణాలను నెమరు వేసుకోవాలి. నీవు తలపెట్టి చిత్తశుద్ది తో చేస్తే ఎటువంటి పనినైనా చేయగలవు అనే విషయాన్ని నీకు పదే పదే చెప్పుకోవాలి. నీవు చేయాలనుకొన్న పనిని చేస్తున్నట్లు దానిలో సంపూర్ణ విజయం సాదించినట్లు మానసికముగా ఊహించుకోవాలి. అప్పుడు మనకు ఆ పని చేయటానికి కావలసిన శక్తి వస్తుంది.

5.4.8 నీవు నిజము అని భావించిన మాటలు మాట్లాడము, నీవు నమ్మే సిద్దాంతాలు పాటించటం ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా నీవు మనస్పూర్తిగా నమ్మిన బాటలో నడవటము, దానికొరకు కఠోర నియమాలు పాటించటము అనే అలవాట్లు నీలోని వ్యక్తిత్వాన్ని పెంచి పరిపూర్ణమైన విశ్వాసాన్ని అందిస్తాయి.నీవు లోపల ఒకటి నమ్మి, బయట ప్రజలకోసం మరొకటి చేయటం నీలో అంతర్గత సంఘర్షణకు కారణమై నీలోని శక్తిని తగ్గిస్తుంది.

5.4.9 ఇతరులకు నీవు చేయగలిగిన సహాయము చేయాలి..నీవు చేసే ఆ చిన్న సహాయాలు, అవి పొందిన వారు నీపై చూపే కృతజ్ఞతలు నీలోని శక్తి సామర్ద్యాలను పెంపొందిస్తాయి ఎందుకంటే తన గురించి తాను విశ్వాసంతో ఉండగలిగిన వ్యక్తి మాత్రమే ఇతరులకు సహాయము చేయగలడు. నీలోని భావాలు బలోపేతమై ఇతరుల నుండి నీవు సహాయము ఆశించటం అనేది తగ్గి నీవు ఇంకా ఎక్కువ సహాయము ఎలా చేయగలవు అనే ఆలోచనలు పెరుగుతాయి.నీకు తీసుకోవటం కంటే ఇవ్వటమే గొప్పతనము అని అర్దమై ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులు చేయగల దైర్యము పెరుగుతుంది.5.4.10 మొదటి రోజే పనిని సంపూర్ణ నైపుణ్యము తో చేయాలి అని మనపై మనము ఒత్తిడి పెంచుకోరాదు. ఏ పనైనా మనము చేసే కొద్ది మనకు అనుభవము పెరిగి మనకు నైపుణ్యము వస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఆ పని చేయాటానికి కావలసిన మెలుకవలను సానుకూల దృక్పదంతో ఆసక్తిగా గమనించి రోజు రోజుకూ కొద్ది కొద్దిగా విజయాలను పొందుతూ ముందుకు కదలాలి. మనము చేసిన పొరపాట్లను విశ్లేషించి వాటిని రాబోయే కాలములో ఆపటానికి కావలసిన మార్గాలను గుర్తించి పాటించి సాదించాలి..అంతే కాని మొదటి ప్రయత్నము లోనే పూర్తి నాణ్యత రావాలని రాకపోతే అపజయము పొందామని భావించరాదు..మన ఆలోచనా విదానమే మన విశ్వాసము, మన శక్తి, మన కదలిక, మన జీవిత సాఫల్యము.. ఈ సిద్దాంతాలు పాటిస్తే ఆత్మ విశ్వాసం నిరంతరం మన వెంటే ఉంటుంది.

పాఠము – 4 నాయకత్వ లక్షణాలు, వివిధ రకాల శక్తుల ఆవిష్కరణ

పాఠము – 4  నాయకత్వ లక్షణాలు, వివిధ రకాల శక్తుల ఆవిష్కరణ
4.1. నాయకుడు అంటే ఎవరు? భారతదేశానికి నాయకత్వము అంటే ఏమిటి?


4.1.1. ఎవరైతే స్వచ్చందంగా తనుచేసే పనిని సంపూర్ణ ఏకాగ్రతతో నిజాయితీగా చేస్తారో, ఎవరైతే తన శ్రేయస్సు కోసమే కాక ఇతరుల మంచికోసం కూడా ప్రయత్నం చేస్తారో వారే నిజమైన నాయకులు. అంతేకానీ ఇతరులమీద అధికారము చేసేవాడు నాయకుడు కాదు. నాయకునికి అధికారము సహజముగా లభిస్తుంది.

4.1.2. నాయకుడికి ఉండేటటువంటి మొదటి లక్షణము తను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉండటము దృడ నిశ్చయంతో ముందుకు కదలటము. తరువాత తను చేసే పనులు, మాట్లాడే మాటలు ఆలోచించే ఆలోచనలు అర్థవంతముగా, విశ్లేషణాత్మకంగా, సానుకులముగా, పదిమందికి మంచిచేసేవిగా ఉంటాయి.

4.1.3. తను చేసిన ప్రమాణము, తను చేయదలుచు కొన్న కార్యక్రమం తను సాధించదలుచుకొన్న లక్ష్యమునకు కట్టుబడి ఉండటము అనేవి నాయకునికి ఉండే అటువంటి లక్షణాలు. అవి లేకుండా ఎంతటి అధికారంలో ఉన్న వ్యక్తి అయిన, ఎంతటి ధనవంతుడైన అతనిని నాయకుడిగా పరిగణించలేము.

4.1.4. నాయకుడు చేసే పనులు పదిమందికి ఆదర్శముగా మారతాయి. అసంకల్పితంగా అందరూ అతని పనులను ప్రశంసిస్తారు అనుసరిస్తారు తను చేసే పనులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తాడు. అనేక సమస్యలకు సమాధానాన్ని ఆచరించి చూపుతాడు.

4.1.5. నాయకుడు క్లిష్టమైన పనులను చేయడానికి దైర్యముగా ముందుకు వెళతాడు. తను విజయము సాదించగలను అనే నమ్మకముతో నియమబద్దుడై, బాధ్యతకు కట్టుబడి విలువలతో జీవితాన్ని గడుపుతాడు. తనది కాని సొమ్మును ఆశించడు. తన స్వార్థానికి అతీతంగా ఆలోచిస్తాడు. తన బలహీనతలను జయిస్తాడు. క్రమక్రమముగా తన జీవిత లక్షాలను సాధించి నూతన విధానాలను సమాజానికి పరిచయం చేస్తాడు.

4.1.6. నాయకత్వ లక్షణాలున్న ప్రతి వ్యక్తీ నాయకుడే. అంటే నాయకులు కొంతమందే ఉండనక్కర్లేదు. భారత పౌరులందరూ నాయకులుగా జీవించవచ్చును. ఎప్పుడైతే అధికశాతం పౌరులు నాయకత్వ లక్షణాలు కలిగిఉంటారో, ఎప్పుడైతే ఎక్కువమంది దేశ సమస్యలను తమ సమస్యలుగా భావించి నిరంతరము వాటి పరిష్కార దిశగా ఆలోచిస్తారో తనంతట తానే దేశం నాయకత్వదేశంగా మారుతుంది.

4.1.7. ఏ దేశములో అయితే నాయకత్వ లక్షణాలున్న పౌరులు ఎక్కువగా ఉంటారో ఆ దేశం దిన దిన అభివృద్ధి చెందుతుంది, ధర్మము నాలుగు పాదాల నడుస్తుంది. ప్రజలు సుఖశాంతులతో నిర్భయముగా స్వతంత్ర భావాలతో సంతృప్తికరమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు.

4.1.8. తన మీద నిఘా ఉన్నప్పుడు చట్టాలకు భయపడి ఇతరులు ద్వేషిస్తారని ఎవరైనా గమనిస్తున్నారనిమంచిగా నడవటం అనేది నాయకుని లక్షణం కాదు. నాయకునికి ఎవరి భయము ఉండదు. తనే స్వచ్చందంగా ఆదర్శవంతమైన జీవితాన్ని మనసా, వాచా, కర్మణా పాటించి నడుస్తాడు. అతని ఆత్మ నిగ్రహానికి, ఆత్మ బలానికి, ఆత్మధైర్యానికి ఎన్నో సంక్లిష్టమైన సమస్యలు లొంగిపోతాయి. అసాధ్యాలు సుసాద్యాలుగా మారతాయి.

4.1.9. నాయకుడు తనకు ప్రకృతి, దైవము యిచ్చిన అన్ని రకాల శక్తులను పరిపూర్ణమైన విశ్వాసముతో వినియోగించుకుంటాడు, గౌరవిస్తాడు, ఆరాధిస్తాడు. అందులోని అద్భుతాలను అనునిత్యము ఆస్వాదిస్తూ నిత్య సంతుష్టుడై, దురాశలేనివాడై, తన సమాజ ఉన్నతిని ఆశిస్తూ అందులోని చెడు లక్షణాలను తగ్గించే దిశగా సంఘటిత శక్తిని ప్రోత్సహిస్తూ పక్షపాత రహితుడై, అందరిని ప్రోత్సహిస్తూ, ప్రేమను పంచుతూ ముందుకు కదులుతాడు. ఆ ప్రయాణములో తనకే తెలియని దైవిక శక్తులను మేల్కొలుపుతాడు.

4.1.10. భారతదేశానికి నాయకత్వము వహించటం అంటే భారతజాతి అనేక సంవత్సరాల నుండి అనుభవిస్తున్న జాతీయ సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించటం భారతీయులందరినీ అక్షరాస్యులుగా, తెలివితేటలున్నవారిగా, విజ్ఞానవంతులుగా, అదర్శపౌరులుగా, ఆరోగ్యవంతులుగా, నాయకులుగా మార్చే ప్రక్రియలో పాలుపంచుకోవటము. ఈ దిశగా రెండొవ జాతీయ ఉద్యమాన్ని ప్రభావితం చేసి నడిపించటము. అదే భారత నాయకత్వము.



4.2. శారీరక శక్తిని నిజమైన నాయకుడు ఎలా ఉపయోగిస్తాడు?

4.2.1. మనిషి శరీరంలో అనంతశక్తి దాగి ఉంది. కాని అది ధైర్యవంతులకు, ప్రతిభావంతులకు, త్యాగధనులకు, యోగమూర్తులకు నిజమైన నాయకులకు మాత్రమే లభిస్తుంది. ఎవరి మనసైతే తాను సాధించవలసిన కార్యములపై, తాను నిర్వర్తించవలసిన భాధ్యతలపై లగ్నమౌతుందో అతనిని శారీరక బాధలు ఆపలేవు, ఆతను నిర్విరామంగా తన లక్ష్యం వైపు పయనిస్తాడు, శరీరం సహకరిస్తుంది.

4.2.2. శారీరక సుఖాలకు బానిసైన వ్యక్తి, బలహీనతలకు చెడు అలవాట్లకు బానిసైన వ్యక్తి నిర్వీర్యుడై శారీరక శక్తి క్రమక్రమముగా నశించి, నిస్సారమైన జీవిగా మరణిస్తాడు. వందల కొద్ది వైద్యులు, వేల కొద్ది రూపాయలు అతనిని కాపాడలేవు. అటువంటి వ్యక్తి నిజమైన నాయకుడు కాజాలడు, ప్రక్రుతి కోపానికి గురై అధోలోకానికి జారతాడు.

4.2.3. నిజమైన నాయకునికి తన శారీరక శక్తులను వశపరచుకోవటము, వాటిని క్రమశిక్షణతో దృడపర్చుకోవటము, వాటిని భగవంతుడు తనకిచ్చిన కానుకగా చూడటము అనే లక్షణాలుంటాయి. వాటిని ఆతను తన కార్యసాధనలో అర్ధవంతంగా ఉపయోగించి అజేయుడౌతాడు.

4.2.4. మనముందు అనేక అబద్దపు వ్యాపార ప్రకటనలు, మనుషులను నిర్వీర్యము చేసే ఉత్పత్తులు, తాత్కాలిక ఉల్లాసాన్ని దీర్ఘకాలంలో జబ్బులను కలిగించే తినుభండారాలు చలామణి అవుతున్నాయి.

మనము బలహీనులమని, ఏ పనిని చేయలేమని మనలను మనమే తప్పు ద్రోవలో నడుపుకొంటున్నాము. మన నిజమైన శక్తిని మనము అంగీకరించగలిగితే ఆ దిశగా మనము ప్రయత్నము చేస్తే మన ఆత్మ చైతన్యమై అనేక విధాలుగా అభివృద్ది ఆనందము, సంతృప్తి శక్తి సామర్ధ్యాలు వస్తాయి.

4.2.5. మన నిజమైన శక్తిని మనము గుర్తించలేక పోతున్నాము, అభివృద్ధి చేసుకోలేక పోతున్నాము, మనలను మనము తక్కువగా అంచనా వేస్తున్నాము. పిరికిపందలుగా జీవించే మనుషులు, సమస్యలను అవకాశవాద ధోరణితో చూసే మనుషులు, బాధ్యతలను వదిలి వేసే మనుషులు అధికారాన్ని దుర్వినియోగం చేసే మనుషులు, తమ శారీరక దృడత్వాన్ని తెలుసుకోలేక తమకు తాము నచ్చచెప్పుకొంటూ తమ జీవిత అంతరార్థాన్ని గ్రహించలేక చరిత్రహీనులవుతారు.

4.2.6. మనము ఏ విధముగా మనలను భావిస్తామో మనము అలా మారతాము. మన ఆత్మతో మనము మన శక్తి గురించి మనము భావించే భావనలు మన శారీరక శక్తిని ప్రేరేపిస్తాయి. ప్రతికూలముగా మనము భావించినపుడు అటువంటి మార్పులు సంభవిస్తాయి. అందుకే మన మనస్సు ఎప్పుడు పవిత్రముగా, నిస్వార్ధముగా నిభద్దతతో ఉంటే మన శారీరక శక్తులు వృద్ది పొందుతాయి.

4.2.7. సమస్యలను వదిలి వేసేవాడు, సుఖాలు తప్ప కష్టాలను భరించలేని వాడు, దగ్గరి దారిలో అతిగా ఆస్తులను కూడబెట్టాలనుకొనేవాడు నాయకునిగా జీవించలేడు. నాయకుడు అవసరమైన కష్టాలు చూసి వెరవడు. అవసరమైన చోట తన స్వంత సుఖాలను త్యాగం చేసి మరీ తానూ చేయవలసిన ధర్మాన్ని నేరవేరుస్తాడు.

4.2.8. తర్కరహితమైన నమ్మకాలు, సమాజానికి ఇబ్బందికలిగించే అలవాట్లు తెలియని ఆపదల గురించి ఆందోళన వంటి లక్షణాలు మనిషికి శాస్త్రబద్దమైన అభివృద్దికి ఆటంకము. నాయకుడు నమ్మకాలకు అతీతంగా ఎదిగి, అంచనాలకు అందని రీతిలో విషయాలను త్యజించి సమయస్పూర్తి కలిగిన పరిపూర్ణమైన వ్యక్తిగా జీవించి పది మందికి మార్గదర్శిగా మారి తన శారీరక ద్రుడత్వాన్ని ఇనుమడింప చేసుకొంటాడు.

4.2.9. సమతుల్యములేని విధానాలు, అనాలోచిత వెర్రి చేష్టలు, గర్వపూరిత ధనవంతులు, వ్యతిరేక పరిస్థితులు నాయకుని తన కర్తవ్య నిర్వహణ నుండి బయటకు తీసుకొని వెళ్ళలేవు. సరియైన నాయకుడు సత్కార్య నిర్వహణలో తన శరీరానికి జరిగే లేక రాబోయే ఆపదలను లక్ష్యపెట్టడు.

4.2.10. మన దేశాన్ని స్వతంత్ర భారత్ గా నిలబెట్టడానికి ఎంతోమంది త్యాగదనులు తమ శారీర సుఖాలను త్యాగం చేసి అసాధారణమైన శక్తిని ఆవిష్కరించారు. వారిలో ఉన్న ఆ బలమైన కోరిక, తాము ఒక పవిత్ర దేశాన్ని స్వేచ్చగా మార్చాలనే నిబద్దత వారిని నాయకులుగా తీర్చిదిద్దాయి. ఎంతో మంది శాస్త్రజ్ఞులు, పారిశ్రామికవేత్తలు, సంఘసంస్కర్తలు, కళాకారులు తమ జీవితంలో ఎన్నో త్యాగాలు చేయటం అనేది మనం గమనించవచ్చును. ఆ ఆవిష్కరణ వారిలో శారీరక శక్తి ఉత్తేజము అవటం వలన ఉద్బవించింది.



4.3. నైతిక శక్తి నాయకుని ఎలా నడిపిస్తుంది?

4.3.1. శారీరక శక్తి కన్నా నైతిక శక్తి గొప్పది. నైతిక శక్తి నుండి శారీరక శక్తి ఉద్బవిస్తుంది. తను నమ్మిన నైతిక విలువలపై అపారమైన నమ్మకమున్న మనిషి సరియైన దారిలో నడిచి అందరికి ఆదర్శంగా నిలుస్తాడు. అతను చేసే పనులను, సమాజ శ్రేయస్సు కోసం ఆతను చేసే ధర్మబద్దమైన పోరాటాన్ని ఆపటం ఎవరి తరము కాదు. అతనికి అదృశ్య శక్తులు సహకరిస్తాయి.

4.3.2. స్వామి వివేకానంద చెప్పినట్లు సత్యము, పవిత్రత, నిస్వార్ధం అను మూడు సుగుణములు కలిగిన వ్యక్తి తనకు ఈ ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉన్నను తను చేసే మంచి పనులను కొనసాగించగలడు. అతనిలో ఉన్న నైతిక బలము అతనికి ధైర్య సాహసాలను, మానశిక శక్తిని ఇచ్చి ప్రోశ్చాహించి నడుపుతుంది.

4.3.3. మనలో చాలామంది మంచి తనానికి రోజులు కావని, నీతికి నిజాయితీకి కాలం చెల్లిందని, నియమాలు త్యజిస్తే మనము ధనవంతులము కాగలమని అవినీతి అక్రమ సంపాదన మోసపూరిత వ్యపారాలద్వారా అస్తులు కూడబెట్టాలని భావించి ఈ సమాజంలో సహజ న్యాయాన్ని మానవత్వ పునాదులను కదిలించ టానికి ప్రయత్నిస్తున్నారు కాని అది తాత్కాలికము. ఈ సృష్టికి ఉన్న ప్రాదమిక సూత్రాలు అటువంటి భావనలను పద్దతులను సమర్ధించదు అటువంటివారికి పురోగతి ఉండదు. కాలక్రమం లో వారు చేసిన పనికి ఫలితం చెల్లిస్తారు

4.3.4. ఎక్కడా ఏ దేశంలో లేనంతగా గొప్ప నైతిక సంపద ఉన్న పవిత్ర దేశం మనది ఈ దేశంలో ఎంతో మంది త్యాగ దనులు, నిస్వార్ధ పరులు నీతికి కట్టుబడి ఉండే నాయకులూ జన్మించి ఆచరించి ఆదర్శంగా నిలిచారు. అటువంటి మనదేశంలో యువత కొంతమంది పక్కదారి వైపు చూస్తున్నారు కానీ మనముందు పరిష్కరించవలసిన అనేక జాతీయ సమస్యలున్నాయి. ఇనుప కండరాలు ఉక్కు నరాలు, అనంతమైన పట్టుదల ఉన్న యువకులు సింహాలవలె ఈ దేశ పవిత్రతను, స్వతంత్రతను, నాయకత్వాన్ని నిలబెట్టాలి.

4.3.5. నిస్వార్ధమైన విలువలు మానవత్వ సిద్ధాంతాలు, తనమీద తనకు అపారమైన నమ్మకం, చేయదలచుకొన్న పనికి అంకితభావం అన్నీ కలిస్తే నైతిక శక్తి గా ఉద్భవిస్తాయి. అటువంటి నైతిక బలాన్ని పెంచుకొన్న వ్యక్తి, గొప్పవాడుగా ఎదిగి ఈ దేశ గమనాన్ని మార్చగలడు. ఈ సమాజాన్ని ఉన్నత స్థానానికి నడిపించగలడు.

4.3.6. మన ప్రజలలో కొంతమంది అనేక రకాల మూడ నమ్మకాలూ, అనాధరిత భావనలు, గొర్రెల మంద ధోరణి, అనవసర విభేదాలు, అనైక్యత, వర్గపోరాటాలు, స్వార్థ పరమైన ఆలోచనలు, మోసపూరితమైన కార్యక్రమాలు ఇలా అనేక అవలక్షణాలలో దారిద్ర్యం లోనికి తాము వెళ్లి దేశాన్ని అబివ్రుద్దికి దూరంగా నడుపుతున్నారు. దీనిని మార్చటానికి ప్రతిమనిషి నైతిక శక్తి, విలువలు నిస్వార్థత యొక్క దీర్ఘ కాలిక ఫలాలను వివరించి, ఆచరింప చేసి ప్రతి ఒక్కరిని నాయకునిగా మార్చవచ్చు.

4.3.7. నైతిక శక్తి ఉన్న వ్యక్తికి ప్రపంచంలో ప్రతి వ్యక్తి తన సోదరునిగా సోదరి లాగా అనిపిస్తుంది. వారియొక్క సంక్షేమమానికి గాని,మనస్సుకి గాని నష్టము కలిగే పని చేయలేడు, ఆవిధంగా అతను సర్వత్రా ఆమోదయోగ్యంగా మారతాడు. తన మనసులో ఎటువంటి విభేదాలు ఉండవు ఎదుటివారు తనకంటే తక్కువ అనే ఆలోచనలు ఉండవు. ముందుకు నడుస్తూనే ఉంటాడు. ఈ సృష్టి లో సకల జీవరాసులు అతనికి సమంగా కనిపిస్తాయి. అపుడు అతనికి ఈ ప్రక్రుతి తన అద్వితీయ శక్తులను అందిస్తుంది. ఆ బలముతో అతను గొప్ప నాయకునిగా మారతాడు, కొనియాడబడతాడు.

4.3.8. తమకు ఎదురైన కష్టాలను, తమను వ్యతిరేకించే వారితో, అనుకోని ఆపదలలో, తమ ఆస్తులకు, దనానికి పొంచివున్న ప్రమాదములో కూడా నైతిక విలువలున్న వ్యక్తి అత్యున్నతమైన స్పందన చూపిస్తాడు. ఎపుడైతే అటువంటి స్పందన అతనిలో కనబడుతుందో ఆతను నిజమైన నాయకునిగా ఎదుగుతాడు. నైతిక శక్తి అతనిని క్రుంగి పోనీయదు, పారిపోనియదు, దగ్గరిదారులలోనికి వెళ్ళనీయదు. తనకు మార్గదర్శకముగా నిలిచి ముందుకు నడిపి సమస్యలను దైర్యముగా ఎదుర్కొనే విదముగా చేస్తుంది. ఆ ప్రయాణములో అతని వ్యక్తిత్వం గుర్తించబడుతుంది.

4 .3 .9 నైతిక విలువలను స్వచందంగా, నియమబద్ధంగా పాటించ వలసి ఉంటుంది. అవి ఎవరూ మన మీద బలవంతముగా రుద్దలేరు . మనిసి తనకు తాను ఆహ్వానించి పాటించ వలసినవి. అవి ఇతరులకు కనిపించవు. మన మనస్సు వాటి ఎడల అపార విశ్వాసము కలిగి వుండాలి. మనల్ని మనమే నియంత్రించు కోవాలి. కొంతకాలము ఆచరణ తరువాత మనిషి వాటిలోని అధ్బుత ఫలితాలను చూడటము మొదలు పెడతాడు. అయాచితంగా తనకు లబించే కీర్తి ప్రతిష్టలను చూసి అది తను పాటించిన నీతి నియమాల పలితమని గుర్తిస్తాడు.ఈ విధంగా ముందుకు కదిలినప్పుడు వ్యక్తి నాయకునిగా ఎదుగుతాడు.

4 . 3 .10 మనము ఎన్ని పోలీసు స్టేషన్లు పెట్టినా, ఎన్ని చట్టాలు చేసినా , ఎంతమంది అధికారులను నియమించినా, మనుషులు నైతికంగా వుండాలని అనుకోకపోతే నేరాలను ఆపలేము.అందుకే నైతిక శక్తి విలువ,అది ఏవిదంగా తన జీవితాన్ని స్వర్ణమయం చేస్తుందో , దాని వలన జీవితములో నాయకత్వాన్ని ఎలా సాదించవచ్చో వివరించి స్పూర్తి కలుగ జేసి , ఆచరించే విధంగా ప్రోత్సహించాలి. అటువంటి గుణాలను సర్వత్ర వ్యాపింప చేయాలి.అప్పుడు గొప్ప నాయకులు తయారౌతారు.

4.4. మానసిక ఉ త్తేజము ద్వారా మార్పు సాధించి నాయకునిగా ఎదగటం ఎలా?

4.4.1. మనిషి శక్తులు అన్నింటిలోనికి అత్యంత శక్తివంతమైనది మానశిక శక్తి. మానశిక శక్తిని ఉత్తేజము చేయటము ద్వారా తమలో పేరుకొనిఉన్న బలహీనతలను మనిషి జయించగలడు. మార్పు చెందటము అనేది మనలో ఉన్న అద్వితీయ ఆత్మశక్తిని మేల్కొల్పటం ద్వారా సాధ్యం.

4.4.2. ఎటువంటి విపత్కర పరిస్తితులనైనా, మన దేహములో ఎటువంటి సమస్యలనైనా మన చుట్టూ పేర్కొని ఉన్న ఎన్ని విధివిపరీతాలనైనా ఎదుర్కొని, ఎదిగి సాధించి నిలబడగల శక్తి మనిషికి మానశిక శక్తి ద్వారా వస్తుంది. ప్రతికూల ధోరణి, పగ, ప్రతీకారము, అసూయలను గొప్ప మానశిక శక్తి కలవారు జయించి సమస్యల పరిష్కారము వైపు పయనిస్తారు. నాయకులుగా ఎదుగుతారు.

4.4.3. పనికిరాని పాతబడ్డ అలవాట్లను, మనకు హాని చేసే మన ప్రవర్తనను వదిలి క్రొత్త వ్యక్తిత్వాన్ని సాధించటానికి చెందే మార్పుతో, మన ముందున్న పరిస్థితులను ఆహ్వానిస్తూ, విశ్లేషనాత్మక ధోరణితో ముందుకు సాగటము ఎదురుగా ఉన్న అవకాశాలను అనుకూలముగా మార్చుకుని తన సమాజానికి మేలు చేసే దిశగా ప్రయత్నించే వ్యక్తికి మానశిక శక్తి తోడ్పడుతుంది.

4.4.4. మన మెదడు అనంతమైన ఆలోచనలకు, భావనలకు, పట్టుదలకు, ఆత్మవిశ్వాసమునకు, ఊహలకు, పరిష్కారాలకు, నూతన మార్గాలకు నిలయము. మానశిక ఉత్తేజము అంటే మన మెదడుని స్వాదీనములోనికి తీసుకుని దానిలో సంభవించే, ఉద్భవించే ప్రక్రియను నియంత్రించటము. అలా చేయగలిగిన మనిషి తను అనుకున్నది సాధించగలడు, తన దేహసంపదను సక్రమంగా వినియోగించగలడు, ఇతరులకు కూడా మేలు చేయగలడు.

4.4.5. మనకి ఎవరో సహాయము చేయాలి, మనలను ఎవరో కాపాడాలి, మనలను ఎవరో మార్చాలి అని భావిస్తూ నడవటము వ్యర్ధజీవుల లక్షణము. సహాయము ఎక్కడనుంచో రాదు. అది మనలోనుండే ఉద్భవించాలి. మనకుమనమే నిజమైన సహాయము చేసుకోగలము. మనకుమనము సహాయము చేసుకోలేనపుడు వేరెవరూ సహాయము చేయలేరు. మనము మన మానశిక శక్తిని ఉపయోగించగలిగినపుడు అనుకున్నది సాధించగలుగుతాము. అందరూ మెచ్చుకునే నాయకునిగా ఎదుగుతాము. మనము నడిచే బాట ఆదర్శముగా మారుతుంది.



4 .4 .6 మనిసి ఉన్నతికి అతని పనులే కారణం. అతని అభివృద్దికి తను తీసుకున్న నిర్ణయాలే కారణం.మన నిర్ణయాల నాణ్యత మన మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మన గమ్యానికి మనమే భాద్యులము.ఈ విషయాన్ని గుర్తించి నిరంతరమూ మనల్ని మనం ఉత్తేజపరచుకుంటూ, ప్రేరణ పొందుతూ, ప్రోత్సహ పరచుకుంటూ మన ముందున్న అనేక సమస్యలను జయించ వచ్చును, గొప్ప విషయాలను సాదించ వచ్చును.





4 .4 .7 అర్ధము లేని భయాలతో , ఆందోళనలతో,ఏమీ చేయలేమనే నిరాశతో అనేక అవసరమైన పనులను మనము చేయకుండా అదృష్టాన్ని

నిందిస్తూ పరిస్థితులను దూషిస్తూ, నిరర్ధకమైన సంభాషణలతో జీవితాన్ని గడుపుతారు కొందరు. సోమరితనము, నిరాశ ,నిస్పృహ,పిరికితనము మొదలైన గుణాలు వారి వ్యక్తిత్వంలో కలిసిపోయి ఇంక ఎమీ చేయలేమని భావిస్తూ జీవిస్తారు.కానీ తమలోనే దాగి ఉన్నపరిష్కారాన్ని ,మానసిక ఉత్తేజాన్ని తెలుసుకోలేరు.ఆ అమృత ప్రవాహాన్ని గుర్తించినప్పుడు వారు నాయకత్వ లక్షణాల్ని పొందుతారు.



4 .4 .8 మనిషికి అలవాట్లు , ఆలోచన సరళి, ప్రవర్తన తన జీవిత అనుభావాలనుండి,తను స్పందించిన విధానమునుండి వస్తుంది.తను తెలుసుకోలేనంతగా అందులో కూరుకు పోతాడు.జీవితములో సంభవించే కష్టాలను అతి పెద్దగా తీసుకొని తనే స్వయముగా తన సమస్యలను పరిష్కరించు కోవచ్చునని, తన మానసిక శక్తిని ఉపయోగించు కోవచ్చునని తెలుసుకోనలేక తనను తాను భాలహీనునిగా భావిస్తూ జీవితాన్ని గడుపుతాడు. మానసికంగా ఎదిగే వ్యక్తి ఈ శక్తిని నిరంతరము ఉత్తేజము చేసుకుంటాడు.తనకున్న అనేక రకమైన సమస్యలను క్రమబద్దమైన కృషితో అధిగమిస్తాడు.

4 .4 .9 మానసిక శక్తి వున్న వ్యక్తి దాని ఉత్టేజముతో నిరంతరము ప్రేరణ పొందుతూ తనకు జరిగే అవమానాలను సైతం పొగడ్తలుగా మార్చుకోగలడు. తనను అవమానించాలని ప్రయత్నించే మనుషులు సైతం పరివర్తన చెందే విధంగా తన ఓర్పు ,నిబ్బరం,ప్రవర్తన,సమాధానము వుంటాయి.అతనిని వ్యతిరేక శక్తులు జయించలేవు.తన ఉన్నత మైన ఆలోచనలతో మళినము అంటని వజ్రములా మెరుస్తాడు.

4 .4 .10 నాయకునిగా ఎదగాలనుకున్న వ్యక్తికి బలహీనతలు ,దురలవాట్లు ,అత్మ న్యూనత, అధైర్యము ఉండరాదు.వాటిని జయించటానికి తాను కష్టమైన మార్పు పొందే ప్రక్రియను చేపట్టాలి.ఆ మార్పును పొందటానికి తాను నిరంతరం మానసిక శక్తిని ఉత్తేజ పరచుకోవాలి.తనకు ఎదురైన కష్టాలను, విమర్శలను తాను పైకి ఎక్కటానికి ఉపయోగపడే నిచ్చెనగా మార్చుకొని ఎదుగుతూ సాగాలి.అనుక్షణం తనతో తాను పోరాడాలి,బలపడాలి,సాధించాలి.

పాఠము 3. పెద్ద పెద్ద కలలు, వాటిని సాధించే ప్రక్రియ...

పాఠము 3. పెద్ద పెద్ద కలలు, వాటిని సాధించే ప్రక్రియ...

3.1. పెద్ద పెద్ద కలలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

3.1.1. ఈ ప్రపంచములోని అభివృద్ధి మొత్తానికి కారకులు కొంతమంది కలలు కనే శాస్త్రవేత్తలు. ఈ వ్యక్తులు తమకు తెలియని వస్తువులను, పరిస్థితులను, పద్దతులను ఊహించుకొని వాటిని గురించి కలలు కని వాటిని నిజ జీవితములోకి ఆవిష్కరించారు. అంటే కలలు కనటము అనేది ఈ ప్రపంచ విజ్ఞానానికి మూల కారణం.

3.1.2. కలలు కని వాటిని సాధించే కృషిలో ఆయా వ్యక్తులు, వ్యాపారవేతలు, శాస్త్రజ్ఞులు వారికి వారు ఒక్క ప్రత్యేక స్థానాన్ని సమాజములో సాధించుకొంటారు. ఆ ప్రక్రియలో సమాజానికి ప్రపంచానికి ఉపయోగపడే మంచి మార్గాలను, వస్తువులను, పద్దతులను అందిస్తారు. ప్రతీ మనిషి ఈ విధమైన జిజ్ఞాసను పెంచుకోగలడు. అలా చేయగలిగినపుడు అందరూ ఈ సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయగలుగుతారు.

3.1.3. గొప్ప గొప్ప విషయాలు సాధించిన వ్యక్తులు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, కష్టాలకు ఓర్చుకొని, తమ పరిస్తితులతో పోరాడి తాము అనుకున్న కలలను నిజము చేసి ప్రజలను ఆచ్చర్యచకితులను చేశారు. అలా పని చేసే మహోన్నత వ్యక్తులు అభివృద్ది చెంది చరిత్రలో తమ పేరును శాశ్వతం చేసుకొన్నారు.

3.1.4. కలలు కని గొప్ప పనులు చెయ్యాలనే ఆకాంక్ష ఉన్నవారికి వారి స్వచ్చమైన శక్తి నుండి వచ్చే ప్రకంపనాలు వారి మనస్సుని, బుద్ధిని, మాటలను, అలవాట్లను, చేతలను విపరీతముగా ప్రభావము చేసి వారు రాత్రి పగలు తథేక ధ్యాన మనుష్కులై ఉండే విధముగా చేసి తమ మానసిక మట్టముపై నిరంతరము కొత్త ఆవిష్కరణలను ఊహించుకొంటూ ఆ క్రమములో ఈ ప్రపంచ గతిని మార్చేటటువంటి అనేక సమస్యలకు సమాధానం చెప్పే విషయాలు కనిపెడతారు.

3.1.5. మన చరిత్రలో చూస్తే గొప్ప గొప్ప శాశ్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, విజ్ఞానవేత్తలు తాము పుట్టిన, పెరిగిన పరిస్థితులతో సంబంధము లేకుండా విజయాలు సాధించిన విషయాలు తెలుస్తాయి. వారిని ముందుకు నడిపినది కేవలం వారిలో అంతర్గతంగా దాగి ఉన్న నిరంతర జిజ్ఞాస, కలలు కనే తత్వము, వాటిని సాకారం చేసుకొనే పట్టుదల మాత్రమే.

3.1.6. చాలా మంది తాము గొప్పవారు కావాలని, ఎన్నో సాధించాలని కలలు కంటారు. కాని కొంతమంది మాత్రమే చివరకు సాధించ గలుగుతారు. అందుకు గల కారణము వారిలోని పట్టుదల. అందరూ వారు చేసిన ప్రయత్నములలో సఫలము కారు. కొంతమంది మాత్రమే తమ ఓటమిని అంగీకరించక మరల మరల ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నము చేసిన వారే తమ కలలను సాధిస్తారు.

3.1.7. ఈ విధముగా కలలను సాధించిన వ్యక్తులను పరిశీలిస్తే వారు నాలుగు ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉన్నారు. 1.తమకు తెలియని విషయాలను ఊహించి వాటిని గురించి కలలు కనటము. 2.ప్రపంచము ఆ విషయాన్ని నమ్మకపోయినా తాము బలంగా నమ్మి ప్రయోగాలు చేయటం. 3.వ్యతిరేక ఫలితాలు వచ్చినా వాటిని అంగీకరించకుండా నిరంతరమూ ముందుకు సాగటము. 4.ప్రతీ క్షణము తమ కలలను సాకారము చేసేటటువంటి విభిన్న మార్గాలను అన్వేషించి విరామంలేని పోరాటం చేయటము.

3.1.8. చాలా మంది కష్టపడి పనిచేసే తత్వము లేని వారు తమ అదృష్టాన్ని నమ్ముతారు. దాని కొరకు దేవుణ్ణి మొక్కుతారు, పూజలు చేస్తారు. కాని నిజమైన శక్తి మన మనస్సులో ఉందని మన మెదడు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దానితో మనము అద్భుతాలు సృస్టించగలమని గుర్తించరు. అటువంటి గొప్ప వ్యక్తులు తమ అదృష్టావశాత్తు అలా విజయం సాధించారని భావిస్తారు. ప్రతీ విజయము సాధించిన వ్యక్తి పడ్డటువంటి కష్టనష్టాలు వారు గుర్తించరు.

3.1.9. మనము ఎదుర్కొనే ప్రతీ సమస్యకు ఏదో ఒక పరిష్కారముంది. ఆ పరిష్కారాన్ని మనము తీవ్ర అన్వేషణ ద్వారా ఆవిష్కరించగలము. మనము ఎప్పుడైతే ఒక సమస్యకు పరిష్కారము అందించే దిశలో తీవ్రముగా ప్రయత్నము చేస్తామో మన మెదడుకు అనేక విధాలుగా సహకరించి కొత్త పద్దతులను విధానాలను అందిస్తుంది. అందుకే ఎవరైతే ఏకాగ్రతతో ఒకవైపు, ఒక సమాధానం వైపు ప్రయాణం చేస్తారో, కలలు కంటారో వారికి కొత్త మార్గాలు ఈ సృష్టిలో అందుతాయి.

3.1.10. ప్రతీ మనిషి ఒక శాస్త్రవేత్తలాగా ఆలోచించగలడు, ప్రతీ వ్యక్తి కొత్తవిషయాలను కనిపెట్టగలడు, ప్రతీ వ్యక్తి తన మెదడును ఒక పరిష్కార యంత్రములాగా వాడగలడు. కాని అనవసరమైన కార్యకలాపాలతో, సోమరితనంతో, నాకెందుకులే అనే తత్వముతో, స్వార్థపూరిత ఆలోచనలతో, మనిషిని నిర్వీర్య పరచే ప్రవర్తనతో, తాత్కాలిక ప్రలోభాలతో, శారీరక బానిసత్వముతో, మానసిక బలహీనతలతో తనలో దాగి ఉన్న ఈ శాస్త్రవేత్తను అనుక్షణం చంపివేస్తూ సాగుతుంటారు. ఎవరైతే విజేతలుగా నిలిచారో, ఎవరైతే ఈ సమాజానికి మార్గదర్శిగా నిలిచారో వారు తమలోని శక్తి యుక్తులని వాడుకొని వాటిని సమర్థవంతముగా ఉపయోగించి పెద్ద కలలు కని వాటిని సాధించి మానవ కళ్యాణానికి పాటుపడ్డారు, తమ అభివృద్దికి దోహదము చేసుకొన్నారు.



3.2: నీవు ఎంచుకున్న వృత్తిలో అద్వితీయంగా ఎదుగుట ఎలా?

3.2.1: ఈ ప్రపంచంలో అనేకరకాల వృత్తివ్యాపారాలు చలామణిలో వున్నాయి. ఎవొక్కటీ గొప్పది లేదా తక్కువది అని చెప్పలేము. ప్రతి వృత్తిలో మనము ఉన్నత స్థానానికి వెళ్ళగలము. మనము మనకు అనుకూలమైన మనకు ఆనందాన్ని కలిగించే వృత్తిని వ్యాపకాన్ని ఎంచుకోవాలి. అపుడే మనము దానిలో ఉన్నతస్థానాన్ని చేరుకోగలుగుతాము. మనస్పూర్తిగా ఆనందంగా చేయగలుగుతాము.

3.2.2: వృత్తిని ఎంచుకునేటప్పుడు చాలామంది సమాజంలో బాగా డబ్బువస్తున్న, తమకు తెలిసినవారు చెప్పినవాటిని ఎంచుకుంటారు. కాని, అది మన ప్రవృత్తికి సరిపడనప్పుడు, దానిపై మనకు సంపూర్ణవిశ్వాసము లేనపుడు మనము దానిలో రాణించలేము. గొప్ప స్థానానికి చేరలేము. అందుకే మనమనసుకు నచ్చేటటువంటి వృత్తిని ఎంచుకోవాలి. దానిలో ఉన్నతికి కృషిచేయాలి.

3.2.3: అందరూ నడిచినబాటలో నడవటం చాలాతేలిక. మనము మనఆలోచనలను ఎక్కువగా ఉపయోగించవలసిన అవసరం లేదు. కానీ, అదేబాటలో మనం నడిచినప్పుడు క్రొత్త అనుభవాలు విజయాలు సాధించలేము. అందుకే మనము మన సొంతఆలోచనలను పద్ధతులను ఉపయోగించటం అలవాటుచేసుకోవాలి. ఒకసారి అలవాటు అయిన తరువాత అదే తేలిక అని అర్ధమౌతుంది.

3.2.4: నీవు తీసుకున్న వృత్తి లేదా వ్యాపారంలో అభివృద్ధిని ఆశించి నీవు నిరంతరము నీసొంత ఆలోచనలతో ముందుకు సాగినపుడు, ఆశ్చర్యకరమైన రీతిలో నీకు క్రొత్త దారులు ఏర్పడతాయి. నీవు ఊహించని విధంగా ఈప్రపంచం నీకోసం సహకరిస్తుంది. నీవు అనుకోని విజయాలు నిన్ను వరిస్తాయి. ఎవరైతే తన వృత్తిని సంపూర్ణ విశ్వాసంతో, నిబద్ధతతో, అంకితభావంతో క్రోత్తదనంతో చేస్తారో, వారే ఆ విభాగంలో నాయకులుగా ఎదుగుతారు.

3.2.5: మనము బ్రతకటానికి ఎంచుకున్న వృత్తి కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా సాగకూడదు. మనం బ్రతుకుతూ, మనచుట్టూ వున్న సమాజాన్ని అభివృద్ధి చేయాలి. మన పనులు సమాజ నిర్మాణానికి తోడ్పడాలికాని వినాశమువైపు పోరాదు. అలా యితరులకు నష్టము కలుగచేసేవృత్తి కాలక్రమములో నాశనము కాకతప్పదు. నీవు ఈసమాజంలో అంతర్భాగము. యితరులకు నష్టము జరిగితే నీకు జరిగినట్లే. నీకు కూడా ఆ నష్టము కాలక్రమములో సంక్రమిస్తుంది.

3.2.6: నీవు నీవృత్తిలో చేసిన పనులు నీతోటివారికి ఆదర్శంగా నిలవాలి. నీవు విలువలతో కూడిన విధానాలను ప్రచారంచేసి వాటిని పాటించి చూపాలి. నిరంతరము నీవు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించి నూతనఅభివృద్ధి సాధించే దిశలో నీవలన నీవృత్తి వ్యాపారవర్గములో క్రొత్త విధానాలకు తెరతీయబడాలి.

3.2.7: మనము ఎంచుకున్న వృత్తిలో ఇప్పటికే గొప్పస్థాయిలో వున్నవ్యక్తుల జీవితాలను పరిశీలించాలి. వారి విజయాల వెనుక రహశ్యాలను గుర్తించాలి. వాటిని విశ్లేషించి వాటిని స్పూర్తిగాతీసుకొని మనము క్రొత్త విధానాలద్వారా అపరిష్కృత సమస్యలను పరిష్కరించేదిశగా ప్రయత్నం చేయాలి. అపుడు ఆదారిలో మనకు ఊహించని విజయాలు నిస్సందేహంగా లభిస్తాయి.

3.2.8: మనము చేసేపని యితరులకు ఎలా ఉపయోగపడుతుంది? అది వారిజీవితాలను ఎలా సులభతరం చేస్తుంది? వారికి యింకా మెరుగైనసేవలు ఎలా అందించాలి? వారికి తక్కువ ఖర్చుతో విలువైనసేవలు ఎలా అందించాలి - అనేవిషయాలలో నిరంతరము మమేకమైనపుడు అది ఒక ధ్యానముగామారి మనము దానిలో సంపూర్ణ శక్తివంతులముగా మారి మనజీవితము విలువైనదిగా కనబడుతుంది.

3.2.9: మనము చేసే పనిమీద అమితమైన ప్రేమ గౌరవము పెంచుకోవాలి. మన పనిని మనము దైవముగా భావించాలి. నిజాయితి, నిబద్ధత అంకితభావములతో ప్రతిరోజు దానిలోకొంత నూతన అభివృద్ధి సాధించే దిశగా పనిచేయాలి. అలా మనము చేస్తున్నపుడు మనపని మనకు ఒకధ్యానములాగా, ఆనందకరమైన ఆటలాగ, ఒక అందమైన చిత్రలేఖనములాగా మనము ఒక పరిణితిచెందిన కళాకారునిలా మారిపోతాము. మన జీవితము మనకు సంతృప్తిని, ఆనందాన్ని, ఆశక్తిని పరిపూర్ణతను అందిస్తుంది. అపుడే మనజీవితం సార్ధకముతుంది.

3.2.10: అందుకే మనము ఆత్మపరిశీలనము చేసుకోవాలి. నీకు నీజీవితము నుండి ఏమి కావాలి అనేది నిశితముగా ఆలోచించాలి. నీవు ఏపనిలో ఆనందాన్ని బాగా పొందుతావు? ఏవృత్తి నీకు మానశికంగా దగ్గరగా వుంటుంది - అనే విషయాలను విశ్లేషించి తెలుసుకోవాలి. అపుడు దానిని నీవృత్తిగా వ్యాపకంగా స్వీకరించు. అపుడు నీకు తెలిసిన వ్యక్తులు ఆవృత్తిలో వున్నవారందరికంటే ఉన్నతమైన విజ్ఞానాన్ని సంపాదించడానికి నిరంతరము కృషిచేయి. దానిలోవున్న అపరిష్కృత సమస్యలకు సమాధానాలు అన్వేషించు. నీవ్రుత్తిని ప్రాణ సమానంగా ప్రేమించు. అలా ప్రయత్నాన్ని విశ్లేషణ ద్వారా చేస్తూనేవుండు. అపుడు నిన్ను ఈప్రపంచము శాశ్వతంగా గుర్తుంచుకునే స్థానం తప్పక చేరుతావు.



3.3: మన లక్ష్య సాధనలో పాటించవలసిన నియమాలు ఏమిటి?

3.3.1:మనము నమ్మిన లక్ష్యాలవైపు నిరంతరము ప్రయాణము చేస్తూ కదిలినపుడు మనము సత్యము కొరకు, పరిపూర్ణత కొరకు ప్రయత్నము చేస్తున్నపుడు, మనకు తెలియకుండానే గొప్ప కార్యాలను సాధించగలుగుతాము. అందుకే ఎపుడూ మన లక్ష్యంపై నమ్మకము చేదరిపోకూడదు. నిరంతర ప్రయాణము సాగాలి.

3.3.2: నీవు నీజీవితములో ఆధిపత్యము కోసము చేసే ప్రయాణములో నీకు అనేక గాయాలుకావచ్చును. కానీ వాటిని నీఅనుభావాలుగా నీవు సాధించబోయే విజయాలకు సోపానాలుగా మార్చుకోవాలి. నీవు ఎపుడైతే నీకెదురైన యిబ్బందులను మనస్పూర్తిగా అంగీకరించగలుగుతావో అపుడు అవి నీకు ఉపయోగపడే నిన్ను గోప్పపనులు చేయడానికి ప్రోత్సహించే ప్రేరణలా పనిచేస్తాయి.

3.3.3: నీవు జీవితంలో కనబడే ఆకర్షణలు శారీరక ఆనందాలు అనుభవించడము తప్పుకాదు. కానీ అవి దీర్ఘకాలంలో చెడు చేసేవి కాకూడదు.నిన్ను జబ్బులపాలు, అవమానాలపాలు చేసి నీకు చెడ్డపేరు తెచ్చేవిగా ఉండరాదు. నీవు ప్రాపంచిక సుఖాలలో బందీగా మిగలరాదు. వాటిని నీవు ఆనందించాలిగాని అవి నిన్ను నియంత్రించరాదు. నీవు నీజీవిత లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి నీలో దాగిన అనంతశక్తిని బయటకుతీసే ప్రయత్నంలో ఎక్కువ కాలము గడపాలి. నీ స్వార్థములో శారీరక సుఖాలలో బందీకావడముకన్నా నీ స్వార్థాన్ని మించి ఎదిగి ఈ ప్రపంచానికి నీ బహుమతి యివ్వటం ఎక్కువ ఆనందాన్ని యిస్తుంది. విజయముకంటే సంతృప్తికరమైన జీవితం ముఖ్యము.

3.3.4: మనకు జీవితంలో కనిపించే ప్రతిసమస్యా అనుకున్నంత తీవ్రంగా ఉండదు. మనకు ఎదురయ్యే ప్రతికూల సంఘటనలనుండి మనము బలంగా ఎదుగుతాము. మనశక్తి పెరుగుతుంది. క్రమముగా ప్రయత్నించినపుడు సమస్య మనకు లొంగిపోతుంది. మనలో సమస్యలపై పెల్లుబికే వ్యతిరేక భావాలను సాలోచనతో అనుకూలంగా మార్చుకొని మనమీద మనము నమ్మకాన్ని పెంచుకొని జయించగలము అనే నమ్మకంతో సాగిపోవటం అవసరం.

3.3.5: మన పరిశీలనాశక్తి పెరిగేకొలది మనలో మనము మార్పుకోసము ప్రయత్నము చేసేకొలది మనకు యింతకుముందు అర్ధంకాని సంక్లిష్ట విషయాలు అర్ధంకావటం మొదలుపెడతాయి. మనిషి సహజలక్షణము తన యిష్టప్రకారము సంఘటనలు జరగాలనుకోవటం. కానీ జీవితం అలావుండదు. మనకు తెలియని ఈప్రకృతిశక్తి మనకు ఏది అవసరమో అది అందిస్తుంది. ఈనమ్మకము పెరిగినపుడు విజయసాధన సులభం.

3.3.6: మనలో చాలామందిమి ఆస్తులు సంపాదించడానికి, సెలవలు గడపడానికి, సినిమాలు చూడడానికి ప్రణాళిక వేసుకుంటాము. కానీ మన జీవిత లక్ష్యాలను నిర్ణయించుకోవడానికి వాటిని సాధించడానికి మనము ప్రణాళిక వేసుకుంటున్నామా? దీనికోసము మనము వేసుకోవలసిన ప్రశ్నలు-

a) నీవు జీవితాన్ని ఎలా వుండాలనుకుంటున్నావు?

b) నీజీవితంలోని ఎటువంటి విషయాలు నీకు నచ్చడంలేదు?

c) నీవు ఎటువంటి విలువలను ప్రమాణాలను పాటించాలనుకుంటున్నావు?

d) నీకు దైవమిచ్చిన అనంతశక్తిని ఎలా వెలికితీయాలనుకుంటున్నావు?

ఈప్రశ్నలతో మన ప్రణాళిక నిర్మించుకొని దానికి కట్టుబడి వుండాలి.

3.3.7: మనిషికి వుండేటటువంటి సహజగుణం పదిమందిని అనుసరించడము. యితరులు ఏమిచేస్తే దానిని మనం గుడ్డిగా నమ్ముతాము. కానీ మన కలలు, మన భావాలు, మనం నమ్మిన సిద్ధాంతాలు పాటించి వాటిని ఆచరించి పరీక్షించినపుడుగాని మనకు మనపై విశ్వాసము, సంతృప్తి కలుగవు. అలాకాకుండా పదిమందిని అనుసరించి మన జీవితం గడిపితే చివరకు సరియైన ఫలితాలు సంతృప్తి రాక మనం చింతించవలసి వస్తుంది. అందుకే మన ఆత్మప్రబోధను ఎపుడూ అనుసరించాలి.

3.3.8: మన జీవితంలో జరిగిన చేదు సంఘటనలు నష్టము కలిగించిన పరిస్థితులు మనలను నిర్వీర్యము చేయరాదు. మనము వాటిని తలచుకొని కృంగిపోరాదు. వాటినుండి మనము భయాన్ని, ద్వేషాన్ని, ఆందోళనను, పగను కోపాన్ని దిగుమతి చేసుకోరాదు. మన గత అనుభవాల చేదు ఊబిలో మనము కూరుకుపోతే జీవితంలో ముందడుగు వేయలేము. అందుకని వాటిని పాఠాలుగా, ప్రోత్సాహకాలుగా, ప్రేరణగా మార్చుకొని సానుకూల దృష్టితో ముందుకు సాగాలి.

3.3.9: ప్రపంచములోని గొప్పవిషయాలను సాధించిన వ్యక్తులందరూ పాటించిన నియమము తమసొంత ఆలోచనలను మొండిగా అనుసరించడము. వారిని పదిమంది ఎగతాళి చేస్తారు. తప్పుచేస్తున్నారని నిరుత్సాహపరుస్తారు. వారు అసాధారణముగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబడతారు. కానీ అటువంటి వ్యక్తులే అభివృద్ధికి మార్పుకు కారకులు. కాబట్టి మనము ఎపుడూ సొంత ఆలోచనాధోరణిని అలవాటుచేసుకోవాలి.

3.3.10: సమశ్యలను ఎదుర్కోవడమే జీవితం. మనము సమస్యలను ఎదుర్కొనేటప్పుడు చాలా ఉత్సాహంగా వుండగలుగుతాము. సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మనము బలపడతాము. అందుకే మనము సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. పెద్ద సమస్యలతోనే వాటిని నెరవేర్చడముతోనే గొప్ప జీవితము గొప్ప విజయాలు సాధించగలము. మనము ఇంతకుముందు చేయని పనులు చేసేటపుడు మన మానసిక శక్తులు వికసిస్తాయి. తద్వారా బలంగా తయారవుతాము. పెద్ద లక్ష్యాలను సాధించగలుగుతాము.



3.4: మన లక్ష్యసాధనలో మనము లీనమైనపుడు జరిగే ప్రక్రియలేమిటి? అవి ఎలా మనలను విజేతలుగా చేస్తాయి?

3.4.1: మనము మన ఆహారము డబ్బు సంపాదించడము కోసమే జీవిస్తున్నాము అని భావిస్తే మన జీవితము ఆనందరహితము అర్ధరహితముగా మారుతుంది. మానవత్వ విలువలను ఈప్రపంచానికి అందించడము, నీవు అందరికీ ఉపయోగపడే పనులు చేయడము ఈజీవిత రహశ్యమని గుర్తించినపుడు నీలో దైవిక శక్తి పెరిగి రోజురోజుకీ అర్ధవంతమైన, సంతృప్తి కరమైన జీవితాన్ని సాధిస్తావు.

3.4.2: మన మెదడు చాలా గొప్ప సేవకుడు మరియు నియంత ధోరణి వున్నయజమాని. ఈప్రకృతి మనకు యిచ్చిన అద్భుతవరం మెదడు. కానీ దానిని మనము సరిగా ఉపయోగించనపుడు ఒక శాపముగా మారుతుంది. అటువంటి మెదడును మన స్వాధీనములోనికి తీసుకోవడము అనేది మనలను మన లక్ష్యములో లీనమయ్యేటట్లు చేస్తుంది.

3.4.3: జీవిత కాలాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రతిరోజును సంతృప్తి కరముగా గడపాలి. మనము పోయిన తరవాత కూడా మనము అందించిన విషయాలు, వస్తువులు, పద్ధతులు ఈభూమిపై నిలిచివుండేలా జీవించాలి. ఎపుడైతే అంత లీనమై మన జీవితం సాగిస్తామో, నీకు ఈ ప్రకృతినుండి అదృశ్యశక్తులు వచ్చి చేరుతాయి. అపుడు మనము మన జీవితము ద్వారా సాధించవలసిన అద్భుతవిజయాలను గుర్తించే ప్రయత్నము మొదలు పెడతాము.

3.4.4: హృదయాన్ని లీనముచేసి, భావాలను పునీతముచేసి మనము మన లక్ష్యమువైపు ప్రయాణము చేస్తుంటే ప్రతిక్షణమూ మనకు ఆనందాన్ని యిస్తుంది. మనము గెలిచామా లేదా అనేదానికంటే మనము గడుపుతున్న జీవితము మనకు అద్వితీయమైన సంతృప్తిని యిస్తుంది. అంటే మనము పూర్తిగా మన లక్ష్యాన్ని జీవిత గమ్యంగా భావించటము అనేది యిక్కడ అవసరము.

3.4.5: మనము చేసే ప్రతిపనినీ మనము అత్యున్నతముగా చేయడానికి ప్రయత్నం చేయాలి. మనము నెరవేర్చవలసిన ప్రతి బాధ్యతనూ మనస్పూర్తిగా చేయాలి. అలా చేసినపుడు నీతోనీవు కలిసి నీ ఆత్మశక్తులను నీవు అందుకోగలుగుతావు. నీజీవితం ప్రతిక్షణం ఆనందభరితముగా, ఉత్సాహంగా ఉన్నతంగా కనిపిస్తుంది. నీవు నీ ప్రయత్నంలో క్రొత్త క్రొత్త ఆనందతీరాలకు చేరతావు. నీలక్ష్యాలు నీకు ఏవిధమైన కష్టమూ తెలియకుండానే వాటంతట అవే నెరవేరతాయి.

3.4.6 ఈ ప్రపంచము అత్యంత శక్తివంతమైన ప్రకృతినియమాలతో నిర్మింపబడింది. జీవితమనే ఆట అందంగా ఆడటానికి మనం ఆ నియమాలు తెలుసుకోవాలి. ప్రకృతికి అనుకూలమైన నియమాలను పాటించడం అనేది మనలను గొప్ప జీవితంలోకి నడిపిస్తుంది. నేవు చేసే ప్రతి పని ప్రకృతికి అనుకూలమైన పని అయితే అది నీ జీవితాన్ని ఉత్తేజితం చేస్తుంది. అంటే మనము ఎదుర్కొనే సమస్యలను మనం ప్రకృతి నియమ ఉల్లంఘన ద్వారా తెచ్చుకుంటున్నాము. ఇతరులకు సహాయం చేయడం, అసాధారణమైన నిజాయితీ, వర్తమానంలో జీవించడము, దయ, జాలి కలిగి ఉండటము, చేసే పని మీద అమిత శ్రద్ధ చూపటము అనే నియమాలు పాటించినపుడు మనము అనుకొన్న గొప్ప లక్ష్యాలు సాధించగలుగుతాము.

3.4.7 తాను గొప్పవాడిని కాగలను అనే నమ్మకం తో మనిషి జీవించినపుడు అతనికి ఆత్మ గౌరవం పెరుగుతుంది. అంతేకాక ఇతరులపై, జంతుజాలము పై, ప్రకృతి పై, జీవితం పై, అపార విశ్వాసం నెలకొంటుంది. ఆ ప్రయాణం లో సృజనాత్మక మరియు ఉహాత్మక విప్లవము సంభవించి మనిషి లో శక్తి సామర్ధ్యాలు వినియోగంలోకి వచ్చి అద్భుత కార్యక్రమాలు నెరవేరటం మొదలు పెడతాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన అద్భుత శక్తి మనలను ప్రోత్సహించడం ప్రారంభిస్తుంది. నీవు సరి అయిన దారిలో ప్రయనిస్తున్నావు అని నీకు కొన్ని శక్తులు తెలియజెప్తూ నడిపిస్తాయి. నీ సమస్యలకు సమాధానాలు నీకు ఎదురువస్తాయి. నీవు అనుకొన్నది జరుగుతుంది. అవకాశాలు నీకు ఎదురు వస్తాయి. నీ గమ్యం నీకు ఎదురవుతుంది.

3 .4 .8 మన కల నిజం చేసుకోవాలంటే కొన్ని సక్రమమైన పనులు చేయాలి. నీవు సాధించ తలచిన కార్యముల కొరకు కొన్ని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. క్రమశిక్షణతో ఉండి తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. మనకు ప్రకృతి ఇచ్చిన శక్తి సామర్ధ్యాలు సక్రమంగా ఉపయోగపడాలంటే వాటిని సరి అయిన మార్గములో నిరంతర ప్రయత్నం ద్వారా ఆచరణలో ఉంచాలి. అపుడే విజయం సాధ్యం.

3 .4 .9 వోడిపోతామనే భయం, తెలియని విషయాల గురించి భయం, మనలను అంగికరించరనే భయం, మనం వేరేదారిలో నడుస్తున్నాము అనే భయం, నాణ్యముగా చేయలేము అనే భయం, ఇలాంటి భయాలు మనలను ముందుకు నడవనివ్వవు. ముందు వాటిని జయించాలి.

3 .4.10 మనిషి గా మనం చేయవలసిన దానిని ప్రయత్నలోపం లేకుండా మన ముందున్న లక్ష్యం వైపు ప్రయత్నించాలి. మన శక్తి వంచన లేకుండా ముందుకు కదలాలి. ఆ తరువాత వచ్చే ఫలితాల గురించి మనం ఆందోళన చెందరాదు. బాధ్యతాయుతంగా నీవు ప్రయత్నము చేసినపుడు నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నము చేసినపుడు తరువాత ప్రకృతి శక్తి నీకు మార్గం చూపిస్తుంది. నీ జీవిత గమ్యానికి నిన్ను అదృశ్య శక్తులు నడిపిస్తాయి. దాని కొరకు నిరంతరం ఓర్పుతో మెలగాలి.

పాఠము 2: మానవుని అనంత శక్తి, నమ్మకాలు, ఆలోచనలు, జీవితము

పాఠము 2: మానవుని అనంత శక్తి, నమ్మకాలు, ఆలోచనలు, జీవితము
2.1.  మన జీవితాన్ని శక్తివంతమైనదిగా మార్చుకోవటం ఎలా?


2.1.1. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రోజంతా నీవు ఏమి ఆలోచిస్తావు, ఏమి తింటావు, ఏవి త్రాగుతావు, ఎటువంటి మనుషులతో సంచరిస్తావు, ఎటువంటి పుస్తకాలు చదువుతావు అనేది నీవు ఎలాంటి జీవితాన్ని నడపాలి అనుకొంటున్నావు అనే దాని నుండి మొదలు అవుతాయి. చివరకు ఆ పనులు నీ జీవిత నాణ్యతను నిర్ణయిస్తాయి.

2.1.2. మనిషి సహజ లక్షణము త్వరగా, తాత్కాలికంగా ఆనందం ఇచ్చేటటువంటి విషయాలవైపు, పనులవైపు, మనుషులవైపు, పుస్తకాలవైపు ఆకర్షించబడటం. ఆ లక్షణాన్ని అదిగమించటం అనేది ఆలోచన ద్వారా సాధ్యం అవుతుంది. మనం చేసేటటువంటి పనుల దీర్ఘకాలిక ప్రయోజనాలను యోచన చేయటం ద్వారా దీర్ఘకాలంలో నష్టం చేసే పనులు చేయలేము.

2.1.3. జీవితంలో మీ అభివృద్దికి ఆటంకం అవుతున్న అన్ని రకాల లక్షణాలను ఒక పుస్తకంలో వ్రాయండి. ఉదాహరణకు నీవు ఇతరులతో పోట్లాడుతావా, అనవసరమైన ఆవేదనలో ఉంటావా, జీవితంలో ఉన్న అవకాశాలను కాక కష్టాలనే చూస్తావా అనేవి తెలుసుకొని వ్రాయాలి. అప్పుడు వాటిని సరైన ప్రణాళిక ద్వారా, విధానాల ద్వారా, నిర్ణయాల ద్వారా మార్చుకునే ప్రయత్నం చేయాలి.

2.1.4. మన జీవితానికి మంచి చేసే పనులను వాటి ఫలితాల ద్వారా వచ్చే ఆనందాన్ని మనసులో ఉంచుకొని దానిని మన ప్రేరణగా మార్చుకొని నిరంతరశ్రమతో సాధించాలి. దాని కోసం మనం కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకొని పాటించటం ప్రారంభించాలి. అప్పుడు మనలో క్రమక్రమముగా మార్పు సంభవించి మనము అనుకొన్న విధంగా మారి గొప్ప శక్తివంతులుగా తయారు కాగలుగుతాము.

2.1.5. నీలో నీవు మార్చుకోవాలనుకుంటున్న లక్షణాన్ని గుర్తించి మొదట దాని ద్వారా నీకు కలుగుతున్న నష్టాలను ఒక పేపరుపై వ్రాసుకో. దాని ద్వారా నీకు రాబోయే కష్టాలను ఊహించుకో. వాటన్నిటినీ ఒకసారి నెమరు వేసుకొని ప్రతిరోజూ ఉదయము, సాయంత్రము గుర్తు చేసుకో. ఆవిధముగా చేసినపుడు క్రమక్రమముగా నీ మెదడులో ఆ లక్షణంపై వ్యతిరేకత పెరిగి నీమీద నీకు నియంత్రణ వచ్చి ఆ లక్షణాన్ని అధిగమించ గలుగుతావు.

2.1.6. ఒకసారి నీవు చేయకూడని పనులు, ఆలోచించకూడని ఆలోచనలను గుర్తించిన తరువాత అటువంటి పనుల వైపు నీ దృష్టి మళ్ళినపుడు నిన్ను నీవు మందలించుకోవాలి, తప్పు చేసినట్లుగా గుర్తు తెచ్చుకోవాలి మరియు స్వీయశిక్ష విధించుకోవాలి. అలా చేస్తున్నప్పుడు క్రమక్రమంగా నీకు అనవసరమైన పనులవైపు, ఆలోచనలవైపు నీ దృష్టి మరలదు. అవి ఆ తర్వాత నీ జీవితము నుండి వెళ్ళిపోతాయి.

2.1.7. నీ జీవితంలో ఉన్న అనవసరమైన అలవాట్లను తగ్గించుకుంటూ వాటిని నిర్మాణాత్మకమైన, సృజనాత్మకమైన ఆలోచనలతో నింపాలి. మన మెదడు ఖాళీగా ఉంటే మరల చెడు అలవాట్లు, ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అందువలన ఇష్టపూర్తిగా మనలను గొప్పవారిగా మార్చే అలవాట్లను అలవాటు చేసుకొని గత ఆలోచనల స్థానంలో నింపుతూ పోవాలి.

2.1.8. ఈ పరివర్తనా క్రమములో మన ఆలోచనలను, పనులను, మాటలను మనం నియంత్రించ వచ్చని గుర్తించటం జరుగుతుంది. మనము మనఃస్పూర్తిగా మంచి పనులు చేయటం, మంచి అలవాట్లు చేసుకోవటం మొదలు పెడతాము. అలా మొదలు పెట్టిన పనులు నిరంతరం సాధన చేయటం ద్వారా మన వ్యక్తిత్వంలో పరిపూర్ణమైన మార్పు వస్తుంది.

2.1.9. జీవితాన్ని గెలిచేవారికి ఓడిపోయేవారికి తేడా ఏమిటంటే గెలిచేవారు కొత్తకొత్త నిర్మాణాత్మక ఆలోచనలను ఆహ్వానించి వాటిని మనఃస్పూర్తిగా ప్రయోగాత్మకంగా పాటించటానికి ప్రయత్నిస్తారు.

2.1.10. ప్రతి రోజూ కొత్త విజ్ఞానాన్ని సంపాదించే వారే నిజమైన నాయకులు. నాయకత్వంతో జీవించే వారు భోజనాన్ని అయినా మానేస్తారు గాని స్వీయాభివ్రుద్దిని మాత్రం మరచిపోరు. ఈ విధంగా ప్రతీ రోజు మనము నిర్మాణాత్మకంగా ప్రయత్నిస్తే మన జీవితం శక్తివంతంగా మారుతుంది.









2.2. ప్రయోజనాత్మకమైన మెదడును నిర్మించుకోవటం ఎలా?

2.2.1. మన విజయ రహస్యము మనము ఆలోచించే ఆలోచనలలో ఉంటుంది. ప్రతి క్షణం మనము ఏమి ఆలోచిస్తున్నాము. మన ఆలోచనలు ఏ దిశ వైపు ప్రయానిస్తున్నాయి అనేది ముఖ్యము. మన మెదడును ఆ విధంగా నడిపించ గలగటము అనేది ప్రయోజనాత్మకమైన మెదడుగా తయారు చేయటానికి మొదటి మెట్టు.

2.2.2. మన జీవితము ఎలా ఉంది అనేది బయట మనకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మన అంతర్గత జీవితము పై ఆధారపడి ఉంటుంది. లోపల మనము ఏమి భావిస్తున్నాము, మన గురించి మనము ఏమి అంచనా వేసుకుంటున్నాము అనే అంతర్గత విషయాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

2.2.3. మనకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది ఎలాంటి నమ్మకాలు మనలను నడిపిస్తున్నాయి అనే దానికి మనమే బాధ్యులము. మన ఆలోచనలు గుర్తించి వాటిలోని ప్రతికూల ఆలోచనలను నిరంతర సాధన ద్వారా శక్తివంతమైన మెదడును తయారు చేసుకోవచ్చును. మన ఆలోచనా సరళియే మన అలవాట్లుగా మారతాయి. మనకున్న బలమైన లక్ష్యం వైపు ఆలోచించే విధంగా మన మెదడును శిక్షణ ద్వారా మార్చుకోవాలి.

2.2.4. మన మెదడు ఒక్కరోజులో ప్రయోజనాత్మకంగా మారదు ప్రతిరోజూ మనము కొంత ప్రయత్నము చేసి మనఃస్పూర్తిగా ఇష్ట ప్రకారముగా మంచి ఆలోచనలను అలవాటు చేసుకున్నప్పుడు అది మన అధీనంలోకి వస్తుంది. కాని ప్రయత్నము తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మన మెదడుకి సాధన ద్వారా నియంత్రణ లోకి వచ్చే గుణం ఉంది. ఈ ముఖ్యమైన కారణం వలనే సామాన్యులు గొప్పవారవుతారు.

2.2.5. మనము మన గురించి ఏమి అనుకుంటాము, ఎలాంటి వారిమని మనము భావిస్తాము, మన ఆత్మతో మనము ఎలా సంభాషిస్తాము అనేది మన మెదడు యొక్క నాణ్యతను నిర్ణయిస్తుంది. మన మెదడులో నడిచే చిత్రాలను గుర్తించి వాటిని మంచి చిత్రాలతో నింపాలి. మన మెదడు బొమ్మల రూపములో విషయాలను గుర్తుపెట్టుకొంటుంది. మంచి బొమ్మలను మన మెదడులో నింపినపుడు మన లక్ష్యానికి సంబంధించిన చిత్రాలను నింపినపుడు మన లక్ష్యాలను సాధించటము సులభమవుతుంది.

2.2.6. మనము నిజాయితీగా నమ్మకముగా బలముగా నమ్మిన ఎటువంటి విషయాన్నైనా మనము సాధించ గలుగుతాము. అది ఎంత కష్టమైనదైనను నిరంతరము మన లక్ష్యాన్ని మన మెదడులో నింపుకోవటం ద్వారా దాని గురించిన కలలతో మన మెదడులోని ఆలోచనలను ప్రభావితం చేయటం ద్వారా ప్రతి క్షణము ఆ రోజంతా ఆ లక్ష్యం వైపు మన మానసిక శక్తిని, శారీరక శక్తిని నడపటం ద్వారా మన మెదడు శక్తివంతమైన, ప్రయోజనాత్మకమైన పనులు చేయగలగటానికి మనలను ప్రేరేపించి మనము ఊహించినటువంటి మానసిక శక్తులు మనకు సహకరించి గొప్ప కార్యాలను సాధించటానికి నడిపిస్తాయి.

2.2.7. మనము మెదడులో దేనినైతే నమ్ముతామో, దేని గురించి అయితే ఆలోచిస్తామో అదే మన జీవితంలోనికి ఆహ్వానించ బడుతుంది. మనసులో సంతోషము, పవిత్రత, మంచి ఆలోచనలు ఉన్నవారు అటువంటి మనుషులనే వారి జీవితములో పొందుతారు. తమకు మంచి జరుగుతుందని నిరంతరము నమ్మే వ్యక్తులకు మంచి అనుభవాలు, సంఘటనలు, ఫలితాలు లభిస్తాయి. అందువలన మనము మన మెదడులో మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా ప్రయత్నం చేయాలి. అప్పుడు అది క్రమక్రమంగా శక్తివంతముగా మారుతుంది.

2.2.8. మన మనసులో మనకు తెలియకుండా దాగి ఉండే నమ్మకాలు మన ప్రవర్తనను ప్రభావం చేస్తాయి. మన జీవితంలో విన్నవి, జరిగినవి, ఆలోచించినవి మన అనుభవాలుగా మారి వాటి గురించి మనము ఒక విధమైన దృక్పథాన్ని అలవాటు చేసుకొంటాము. మన నమ్మకాలను వెలికి తీసి వాటిని విశ్లేషించి మంచి నమ్మకాలను మాత్రం నిలువ ఉంచుకోవటం ద్వారా మన మెదడు పనితీరును శక్తివంతముగా, ప్రయోజనాత్మకంగా మార్చవచ్చు.

2.2.9. మన మెదడు ఒకేసారి అనేక ఆలోచనలను చేయలేదు. కేవలం ఒక్క ఆలోచనపై దృష్టిని ఉంచగలదు. మనము ఏ ఆలోచనను చేస్తున్నామో గమనించటము ద్వారా దాని స్థానములో మంచి నిర్మాణాత్మకమైన ఆలోచనను ఉంచటం ద్వారా మన మెదడును ఏకాగ్రతతో పని చేయించగలము.

2.2.10. నీ మెదడు లోని నియంత్రణ విభాగము నీ ఆజ్ఞలను పాటించటానికి సిద్దముగా ఉంటుంది. మెదడుని నీ స్వాదీనములోకి తీసుకొన్నప్పుడు అది నీ శరీరాన్ని, బుద్ధిని, ఆలోచనలను శాసిస్తుంది. ఇది నీవు అర్థము చేసుకొని గొప్ప కార్యసాధనపై నీ దృష్టిని పెట్టినపుడు నీ మెదడు నీ ఎదురుగా ఉన్న అన్ని అవకాశాలను సాధించటానికి నిన్ను ముందుకు నడిపిస్తుంది.





2.3. గొప్ప వ్యక్తిగా ఎదగటానికి పాటించ వలసిన నియమాలు

2.3.1. మనము సాధించాలనుకొన్న లక్ష్యానికి కట్టుబడి ఉండాలి. దాని గురించే, దాన్ని సాధించాలనే కోరికతో మన మనస్సు నిండి పోవాలి. ఆ విధమైన లక్ష్యాన్ని ఎందుకు సాధించాలి అనుకొంటున్నది దాని వలన మనము పొందబోయే ఫలితాలను తెలుసుకొని వాటిని మన మనస్సు నిండా నింపుకొన్నపుడు మనకు మన లక్ష్యాల వైపు నడవాలనే కోరిక నిరంతరము కొనసాగుతుంది, దానికే కట్టుబడి ఉంటాము.

2.3.2. మనము ప్రయానించాలనుకొన్నమార్గము గురించిన నిర్ణయము తీసుకొన్న తరువాత ఆ విషయము గురించి పరిపూర్ణమైన అవగాహన, విజ్ఞానము సంపాదించాలి. ఆ దారిలో ప్రయాణించిన విజయవంతమైన వ్యక్తుల జీవిత చరిత్రలను, వారు పాటించిన నియమాలను తెలుసుకోవాలి. మన లక్ష్యము గురించిన పరిపూర్ణతను సాధించాలి.

2.3.3. మన సమాజములో గొప్ప విషయాలను సాధించిన వ్యక్తులను పరిచయము చేసుకొని వారిని గురువులుగా స్వీకరించాలి. వారితో నిరంతరము అనుబంధము పెంచుకోవాలి. వారు ఏ విధమైన మార్గాల ద్వారా తమ జీవితములోని విజయము సాధించారో తెలుసుకోవాలి. ఈ విధముగా నీకు నేర్పబడుతున్న విషయాలను చక్కని నిబద్దతతో ఏకాగ్రతతో స్వీకరించగలిగినపుడు నేర్చుకోవటంలో ఆనందాన్ని పొందుతావు.

2.3.4. ప్రతిరోజు నీవు చేసే పనులలో కొత్తదనం ఉండాలి. నీయొక్క సమస్యల పరిష్కారంలో సృజనాత్మకత ప్రదర్శించాలి. నీ జీవిత గమనానికి నీ వ్యక్తిగత అభివృద్దిలో కొద్ది కొద్దిగా ముందడుగు వెయ్యాలి. చిన్న చిన్న అభివృద్ధి కాలక్రమములో పెను మార్పుగా సంభవిస్తుంది. నీవు చేసే ప్రతి పనిని "ఇంకా గొప్పగా ఎలా చెయ్యాలి" అనే ప్రశ్నల ద్వారా మనం చేసే పనులను నిరంతరము అబివృద్ధి చేసుకుంటూ పోవచ్చును.

2.3.5. మనిషి జీవితంలో అన్ని విజయాలే ఉండవు. మనకు అనేక అడ్డంకులు, సమస్యలు ఎదురు వస్తాయి. మనకు వచ్చే అడ్డంకులు మన సామర్థ్యాన్ని పరీక్షించి పెంచుతాయి అనే విషయాన్ని తెలుసుకుంటే మనము వాటిని ఆనందముతో ఎదుర్కొంటాము. నిరంతర కృషి, చెదిరిపోని బలమైన కోరిక ద్వారా మనము మన జీవితంలో ఉండే సమస్యలను జయించగలుగుతాము.

2.3.6. నీవు ఏ పని అయితే చేయడానికి ఇష్టపడవో అది మంచిది అని తెలిసినప్పుడు దానిని చేయటానికి నీవు నిన్ను ప్రతిరోజు సన్నద్ధం చేసుకోవాలి. దేని గురించి అయితే మనము భయపడి సమస్యను వదిలి వేస్తామో లేక దూరంగా వెళ్తుంటమో వాటినే మనము చేయటానికి ప్రయత్నించినపుడు మన శక్తి సామర్థ్యాలు పెరిగి మన లక్ష్యం వైపు దూసుకు వెళ్ళే ధైర్య సాహసాలను పొందుతాము. దీని కోసము మన సామర్థ్యాన్ని, ప్రమాణాలను, విలువలను ప్రతిరోజు పెంచుకుంటూ ముందుకు సాగాలి. ఎప్పుడు ఏ విషయాన్ని మన బలహీనతగా అంగీకరించరాదు. మన బలహీనతలను మనము నిరంతరము పోరాడి బలాలుగా మార్చుకోవాలి.

2.3.7. నీవు ఎంతనేర్చుకొన్న ఇంకా నేర్చుకోవలసినది చాలా ఉంటుంది అని గుర్తించాలి. మనము నేర్చుకోవటము ఆపివేస్తే మరణానికి దగ్గరవుతున్నామని అర్థం. మనకు ఎదురయ్యే ప్రతివ్యక్తి వద్ద నుండి మనము ఎంతోకొంత విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చును. మనము కొత్త ఆలోచనలకు, కొత్త మార్గాలకు, కొత్త పద్ధతులకు అనుకూలంగా స్పందించగలిగినపుడు మనకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి.

2.3.8. మన లక్ష్య సాధనను దానికోసము మనము చేసే కృషిని, అనుభవించే ఇబ్బందులను ఆనందముతో అనుభవించాలి. వాటిని భారముగా భావించరాదు. నీవు మెట్టు మెట్టుగా నీ లక్ష్యం వైపు ప్రయాణము చేయటంలోని ఆనందాన్ని విజయాలను సాధించే మార్గంలో అనునిత్యము అనుభవించాలి. మన జీవితంలోని ప్రతి సంఘటన ఒక కారణంతో సంభవిస్తుంది. మన గత జీవిత సంఘటనలను సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలి. మనకు ఆనందము లక్ష్యమును చేరుకున్నపుడు మాత్రమేకాక సాధించే దారిలో కూడా లభిస్తుంది. దానిని తెలుసుకొని మనము మన జీవిత సంఘటనలను దైవనిర్ణయాలుగా భావించి కదలాలి.

2.3.9. నీవు జీవితములో ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా నీవు నీ ద్వారా ఈ ప్రపంచానికి ఏమిస్తున్నావు అనేది చాలా ముఖ్యము. ఎప్పుడైతే నీవు నీ జ్ఞానాన్ని, సంపదను, సేవను ఇతరుల కొరకు పంచటము మొదలు పెడతావో నీ జీవితం యొక్క నాణ్యత పెరిగి నిజమైన అనుభూతి కలుగుతుంది.

2.3.10. ప్రతిరోజు కొంత సమయాన్ని మన కొరకు కేటాయించుకోవాలి. ధన సంపాదన కొరకు కాకుండా మన ఆనందము కొరకు వినోదము కొరకు ప్రకృతి అందాలను చూడటము కొరకు కొన్ని అలవాట్లను చేసుకోవాలి. ఆ విధముగా మనకు మనం దగ్గరై మన మానసిక శక్తిని పెంచుకోగలము.



2.4. నిజాయితీ, నిబద్ధత, నమ్మకాన్ని నిలబెట్టుకోవటం

2.4.1. మనిషి సంఘ జీవి. ఇతరులతో కలవకుండా, మాట్లాడకుండా, సహాయము పొందకుండా ఎవరు జీవించలేరు. మనకు మన నిజాయితీ, నిబద్ధత ఆధారంగానే విలువ పెరుగుతుంది. నిజాయితీ లేని వ్యక్తి ఎంత తెలివితేటలున్నా ఇతరులు అతనిని గౌరవించరు. కాబట్టి మనము మన జీవితములో నిజాయితి నిబద్ధతను పాటించాలి.

2.4.2. నీతివంతమైన జీవితానికి పాటించవలసిన నియమాలు అయిదు. 1.నమ్మదగిన వ్యక్తిత్వం. 2.సత్యము పలికే గుణం. 3.చేసే పనులలో పారదర్శకత. 4.స్వచ్చమైన మనస్తత్వం. 5. ధర్మబద్ధమైన ఆలోచనలు.

2.4.3. కొంతమంది వ్యక్తులు ఈ లక్షణాలను కలిగి లేకుండా, ఇతర మనుషులను అవన్నీ తమకు ఉన్నాయని నమ్మించటానికి ప్రయత్నము చేస్తూ ఒక ముసుగులో జీవిస్తారు. కాని ఆ ముసుగులో ఆత్మక్షోభ అనుభవిస్తూ తమ జీవిత శక్తిని నశింప చేసుకొంటారు. నీతి నిజాయితీతో నడిచే వ్యక్తికి జీవితము ఆనందముగా సాగుతుంది.

2.4.4. మనము ఏ వృత్తిలో ఉన్నా, ఎటువంటి వ్యాపకములో ఉన్నా మనకు తప్పనిసరిగా ఉండవలసినది నిజాయితీతో కూడిన వ్యక్తిత్వము. సంఘములో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఈ నిజాయితీ ఎక్కువ శాతములో ఉండాలి. అప్పుడు వారు చేస్తున్న పనిలో నిరంతరమూ అభివృద్ధి లభిస్తుంది మరియు నాయకత్వము బలపడుతుంది.



2.4.5. నిజాయితీకి మనము విలువ కట్టలేము. నిజాయితీ, నిబద్ధతను పాటించే వ్యక్తులు తాము ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా తమ సిద్ధాంతానికి కట్టుబడతారు. నిజాయితీకి కాలక్రమములో అనంతమైన గుర్తింపు లభిస్తుంది. ఏ వ్యక్తి అయితే తను చేసే ప్రతి పనిని పరిశీలించి తనను తాను విమర్శించుకొంటూ నిజాయితీతో నడుస్తాడో, అతని పేరు ప్రతిష్టలు నలుదిశలా వ్యాపిస్తాయి. తను చేయవలసిన పనులకు తోటి మనుషుల నుండి సమాజానికి సహాయ సహకారాలు లభిస్తాయి.

2.4.6. ఇతరులకు, సమాజానికి, మన తోటి వారికి ధైర్యముగా చెప్పలేని పనులను మనము చేయరాదు. మనము చేసే పనులు వాటి వెనుక కారణము మన తోటి వారికి అర్థము కావాలి. మనము అప్పుడే సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమాలను చేయగలుగుతాము. పదిమంది మనలను ఆదర్శంగా తీసుకోవటానికి చూస్తారు.

2.4.7. నిజాయితీ మనము చేసే ప్రతిపనిలోను, మాటలోనూ, వృత్తిలోను ప్రదర్శించాలి. మనది కానీ, న్యాయబద్ధముగా అర్హత లేని సంపదను, ఆస్తులను మనము తీసుకోవటానికి ప్రయత్నించరాదు. చిన్న చిన్న పనులలో కుడా మనము ఈ నియమాలను పాటించవలసి ఉంటుంది. నిజాయితీ తప్పిన వ్యక్తి తాత్కాలికంగా లబ్దిపొందినా దీర్ఘకాలములో తన తప్పిదాలకు తగిన మూల్యము చెల్లిస్తాడు.

2.4.8. నిజాయితీ అనేది మనకై మనము అంగీకరించి పాటించే విలువ. అది పాటించటము మొదలు పెట్టినపుడు మానసిక వత్తిడి, అభద్రత, వేదన తగ్గి మనఃశాంతి, ఆనందము లభిస్తాయి. తను ఎవ్వరికీ భయపడవలసిన అవసరంలేనప్పుడు నాయకత్వ లక్షణాలు సహజంగానే వస్తాయి. అంటే మనసా, వాచా, కర్మణా ధర్మాన్ని పాటించాలి.

2.4.9. మన జీవితమంతా కష్టపడి సంపాదించుకొన్న మంచి పేరు ఒక్క అవినీతి అలవాటు ద్వారా మంటలో కలిసి పోతుంది. అందువలన మనము చేసే ప్రతీ పనిని ముందు జాగ్రత్తతో పరిశీలించి నియమబద్ధంగా చేయాలి. మనిషికి కలిగే సాధారణ లాభాలకు లొంగరాదు.

2.4.10. ఎవరైనా మనలను గమనించేటపుడు నిజాయితీగా ఉండటము అనేది మనము చేస్తాము. కాని ఎవరూ చూడనప్పుడు ఒక్కొక్కసారి మనము గీత దాటే ప్రమాదముంది. అది నిజమైన నిజాయితీ కాదు. నిజాయితీ అనేది ఉపన్యాసాల ద్వారా మనము అందించలేము. మనిషికి దీని విలువ అర్థమయ్యేలా అనుభవము కలిగినపుడు తను నియమబద్ధంగా జీవించగలుగుతాడు. గొప్ప వ్యక్తిగా సమాజములో ఉన్నత స్థానానికి ఎదగాలి అనుకునే ఏ వ్యక్తికైనా తప్పక ఉండవలసిన లక్షణము నిజాయితీ. అందువలన దానిని అందరూ నియమబద్ధంగా పాటించాలి.

Wednesday, June 13, 2012

పాఠం1 : జీవితం - గమ్యం - లక్ష్యాలు -ప్రేరణ


లీడ్ ఇండియా మార్గదర్శి  యొక్క ఉపన్యాసావళి
పాఠం1 : జీవితం - గమ్యం - లక్ష్యాలు -ప్రేరణ

1.1 జీవితం అంటే ఏమిటి..దాని విలువ ఏమిటి?


1.1.1 మనిషి పుట్టుకకు చావుకు మద్య ఉండే సమయం జీవితం.. మనము అబ్బాయిగా పుట్టలా అమ్మాయి గా పుట్టాలా ఏఊరిలో పుట్టాలి అనే విషయాలను మనము నిర్ణయించలేదు. అలాగే మనము ఎన్ని సంవత్సరాలు జీవిస్తాము అనే విషయము కుడా మన చేతిలో లేదు.

1.1.2 మనిషి ఈ భూమి పై పూర్తిగా ఉండే సమయం 100 సంవత్సరాలైతే అది 36525 రోజులతో సమానము.. మీకు ఊహ తెలిసే సరికి మీవయస్సు 6 సంవత్సరాలైతే ఆ సమయము పూర్తిగా మీ అదీనములో లేదు. ఉదాహరణకు ఇప్పుడు మీ వయస్సు 15 సంవత్సరాలైతే ఇప్పటికి 5475 రోజులు ఖర్చు అయిపోయినవి... మన జీవితములో సగము పైగా సమయము నిద్రకు ఆహారానికి వినోదాలకు ఖర్చు అవుతుంది.. ఈ విదంగా చూస్తే మన అభివృద్దికి ఏవైనా గొప్ప లక్ష్యాలను సాధించటానికి మనకు మిగిలే సమయము ఎంత అనేది అది ఎంత విలువైనది అర్ధమవుతుంది.

1.1.3 మనము పుట్టుకకు ముందు మనము లేము మన మరణము తరువాత మనము ఈ భూమిపై ఉండము..అంటే జీవితమంటే మనము ఈ భూమిపై గడిపే సమయము..అది అత్యంత విలువైనది అని గమనించవచ్చు..జీవితమంటే సమయమే..సమయనాన్ని వృదా చేయటము అంటే జీవితాన్ని వృదా చేయటము తో సమానము అన్నమాట..సమయాన్ని బాగా ఉపయోగించటము అంటే జీవితాన్ని సార్ధకము చేసుకోవటము....ఉదాహరణకు...ఒక కోటీశ్వరుడైన వ్యక్తి గుండె పోటుకు గురయ్యాడు అనుకుందాము..అయన కుమారుడు ప్రపంచము లో చాలా పేరు ప్రక్యాతులున్న 20 మంది వైద్యులను పిలిచి తన తండ్రిని 20 నిమిషాలపాటు సృహలోనికి తేవటానికి 20 కోట్లు ఇస్తాను అని చెప్పినా కుడా ఆ వైద్యులు ఆ విషయములో ఖచ్చితముగా మాట ఇవ్వ లేరు...

1.1.4 మన జీవితములో సమయము ఖర్చు పెడితే చేజారిపోతుంది.మన ప్రమేయము లేకుండానే మనము ఏ పని చేయకుండా కూర్చున్నా సమయము దొర్లిపోతుంది...ఒక్కొక్క క్షణము వజ్రము కంటే విలువైనది...అందువలన సమయ దుర్వినియోగము జీవిత దుర్వినియోగము తో సమానము..మనము ఖర్చు చేసే ప్రతినిమిషము ఎటువంటి పనిమీద చేస్తున్నాము అనే విచక్షణ అవసరము..అలా అలోచించి చేసే వ్యక్తి తనకున్న పరిమిత కాలాన్ని మంచి విదానములో ఉపయోగించుకొంటాడు.

1.1.5 అందుకే మనము ప్రతి క్షణాన్ని విజ్ఞతతో ప్రయోజనాత్మకముగా మనకి గాని మన తోటి వారికి గాని మన సమాజానికి గానీ ఉపయోగ పడే విదంగా ఉపయోగించాలి.. ఎవరైతే తాము చదువుకొనే సమయాన్ని జీవితాన్ని విలువైనది గా మార్చుకోవటానికి నిరంతరము విజ్ఞానాన్ని సంపాదించుకొంటూ వినియోగిస్తారో వారే జీవితాన్ని సక్రమమైన మార్గము లోనికి నడుపుకోగలుగుతారు..

1.1.6 చదువు అనేది తల్లిదండ్రుల కోసమో...కేవలం డబ్బు సంపాదించే తెలివితేటల కోసమో కాక ఇష్టముతో గొప్ప లక్ష్యాలను సమాజానికి మంచి చేసే గమ్యాలు సాదించాలనే ఆశయాలతో చదివిన వ్యక్తి కాల క్రమములో పేరు ప్రతిష్టలు మంచి పేరు సంపాదించి తన తల్లిదండ్రులకు కుటుంబానికి ఊరికి దేశానికి గౌరవ ప్రతిష్టలు సంపాదించ గలుగుతాడు...

1.1.7 దురలవాట్లకు బానిసై, కేవలము డబ్బు సంపాదన కోసమే, తాత్కాలిక ప్రలోభాలకు గురై, అవినీతి తో అక్రమాలతో హింసా మార్గాలలో పయనించే వ్యక్తి కాల క్రమములో అనేక ఇబ్బందులు ఎదుర్కొని తన జీవితాన్ని చేజేతులా పాడు చేసుకొంటాడు..దాని వలన తనకే కాకుండా తన వలన సమాజానికి కూడా చెడు జరుగుతుంది...

1.1.8 మనము చేసే పనులపైన మన అలావాట్ల పైన ఆధారపడి మన జీవితముంటుంది...అంటే మనము ఈరోజు చేసే పనులు మన జీవిత భవిష్యత్తును నిర్ణయిస్తాయి... తను చేసే పనులను నిర్మాణాత్మకంగా అబివృద్ది ద్రుష్టితో చేసినప్పుడు ప్రతి మనిషి జీవితం లో అబివృద్ది తధ్యము.. ఎంతటి పేద కుటుంబములో జన్మించినా ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నా తన సమయాన్ని విచక్షణతో నియమ నిష్టలతో సంపూర్ణ ఏకాగ్రతతో ఉపయోగించుకొనే వ్యక్తి కాల క్రమములో గొప్ప వ్యక్తిగా రూపాంతరము చెందుతాడు..

1.1.9 అవుల్ పకిర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం గారి జీవితం



అబ్దుల్ కలాం గారు 15 అక్టోబర్ 1931 రామేశ్వరంలో ఒక పేద కుటుంబములో జన్మించారు...చిన్నతనంలో చదువు కోవడానికి ధనము లేని కారణముతో న్యూస్ పేపర్ ను పంచే పనిని ఉదయము సమయములో చేసి గొప్ప శాస్త్రవేత్త కావాలనే లక్ష్యమును కలలు కనే వాడు..కాలక్రమము లో గొప్ప శాస్త్రవేత్త గా..భారత దేశము గర్వించ దగ్గనాయకునిగా...భారత ప్రెసిడెంటుగా..భారతరత్నగా ..గొప్పరచయితగా ఎదిగి అయన జీవితాన్ని ఎంతో మంది ఆదర్శముగా తీసుకొనే విదంగా ఎదిగారు... దానికి అంతటికి మూలము అయన తన జీవితంలో పాటించిన నియమాలు...సిద్దాంతాలు...గొప్ప అలవాట్లు...అంటే మనము కుడా మన జీవితాన్ని క్రమశిక్షణతో మలుచుకొంటే గొప్ప నాయకులుగా ఎదగటం సులభ సాద్యము అని అర్ధమవుతుంది



1.1.10 స్వామి వివేకానంద సూక్తి:





"లేచి నిలబడు ధైర్యము గా ఉండు..బలముతో ప్రయత్నించు..నీ జీవిత బాద్యతను మొత్తాన్ని నీ భుజస్కందాలపై స్వీకరించు..నీ జీవిత గమ్యాన్ని నీవే సృష్టిస్తావు..దానికి కావలసిన సకల శక్తి సంపదలు నీలోపలే దాగి ఉన్నాయి..వెలికి తీయి..నీ భవిష్యత్తుని నీవే నిర్మించుకో"...



1.2 మనకున్న జీవితసమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎలా?

1.2.1 నీవు ఒక రోజులో, వారంలో, నెలలో, సంవత్సరంలో చేయవలసిన పనులు ఒక ప్రణాళిక వేసుకొని వ్రాసుకోవాలి. ఆ విదంగా ప్రణాళిక వేసుకున్నపుడు మనము జీవితములో ఎటువైపు వెలుతున్నాము..ఆ ప్రయాణంలో మనము తీసుకోవలసిన మలుపులు ఏమిటి అనే దానిపై మనకు ఒక ఖచ్చితమైన అవగాహన వస్తుంది. మన మనస్సు నిండా మనము సాదించవలసిన లక్ష్యాలపై ద్రుష్టి ఉన్నపుడు మన సమయం ప్రతి క్షణం సద్వినియోగం చేసుకొనే అవకాశముంది.

1.2.2 ప్రతిరోజూ నిద్ర లేస్తూనే మనకు ఇంత గొప్ప మనవ జీవితాన్ని ప్రసాదించిన దైవానికి, తల్లిదండ్రులకు, గురువులకు మానసికముగా కృతజ్ఞతలు తెలుపుకొని మనముందున్న ఈ అపురూపమైన రోజును వినూత్నముగా సృజనాత్మకతతో ఎలా ఉపయోగించాలి...ఈ రోజులో మనము సాదించవలసిన, పూర్తి చేయవలసిన విషయాలు ఏమిటి అనేది గుర్తు చేసుకోవాలి. గంట గంటకు ప్రణాళిక వేసుకోవాలి..ఆ పనులు మన లక్ష్యము వైపు మనలను తీసుకు వెళ్ళేవి అయి ఉండాలి..అప్పుడు మనము ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకొంటాము.

1.2.3. మనము పనులు చేయటము ప్రారంబించినపుడు అనేక శక్తులు పరిస్థితులు వినోదాలు స్నేహితులు మన దారినుండి పక్కకు లాగే ప్రయత్నాలు చేయవచ్చు..ఆత్మ నిగ్రహముతో జీవించి మనము మన ప్రణాళికకు కట్టుబడి ఉండాలి. ఎటువంటి పరిస్థితులలోనూ మనము అనుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. మనము అనుకొన్నది సాదించలేనప్పుడు మనలను దారి మళ్లించిన వారే గేళి చేస్తారు.ఎద్దేవ చేస్తారు..అది మనము ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

1.2.4. మనము చేసేపనులను ముఖ్యమైనవి-త్వరగా చేయవలసినవి, ముఖ్యమైనవి-భవిష్యత్తులో చేయతగినవి, ముఖ్యమైనవి కానివి-త్వరగా చేయాలి అని మనము అనుకోనేవి, ముఖ్యమైనవి కానివి-భవిష్యత్తులో చేయాలి అని మనము అనుకోనేవి అనే నాలుగు విభాగాలుగా చేసి అందులో ముఖ్యమైనవి-త్వరగా చేయవలసినవి ముందు ముగించాలి..సాద్యమైనంత వరకు ముఖ్యమైనవి-భవిష్యత్తులో చేయతగినవి, ముఖ్యమైనవి-త్వరగా చేయవలసినవిగా మారకుండా చూసుకోవాలి. మిగతా రెండు విబాగాలు ముఖ్యమైనవి కానివి-త్వరగా చేయాలి అని మనము అనుకోనేవి, ముఖ్యమైనవి కానివి-భవిష్యత్తులో చేయాలి అని మనము అనుకొనే పనులకోసము చాలా తక్కువ సమయం కేటాయించాలి...

1.2.5. మనము చేసే పనుల ఫలితాలను ముందుగానే ఆలోచించి మంచి ఫలితాలున్న పనులను మాత్రమే చేయాలి. మన పనుల పర్యవసానాలను వాటి వలన జరిగే ప్రయోజనాలను అంచనా వేసుకోనప్పుడు మనము గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రయాణం చేసే అవకాశముంది.మన సమయాన్ని వృదా పనుల పై గడిపే అవకాశముంది. అందువలన సంపూర్ణ విశ్లేషణ తో ముందు చూపుతో మనము చేయబోయే పనులను అవగాహన చేసుకుంటూ ముందుకు కదలాలి..

1.2.6. నీ జీవితానికి ఉపయోగపడే పనులను ఇష్టముతో ఆనందముతో నీవు సాధించబోయే విజయాలను ఊహించుకొంటూ ఉత్సాహముతో ఓర్పుతో ఆ పనులను నిర్వహించినపుడు నీవు చేసే పనిని ఒక ఆట లాగ చేయగలవు. అంతే కాకుండా నీవు ప్రతి క్షణాన్ని ఆనందముతో నింపుకోగలవు.

1.2.7. మనము చేసే పనులలో వినోదానికి, క్రీడలకు 20% లోపు సమయాన్ని మాత్రమే కేటాయించాలి.. అనవసరమైన సంబాషణలు..అతిగా టీవీ ప్రోగ్రాములు,ఫోనుపై నిరుపయోగమైన మాటలు తగ్గించి మన లక్ష్యాలవైపు ఉపయోగపడే పనులు కొనసాగించాలి.

1.2.8.ప్రతిరోజూ పడుకోబోయే ముందు మనము అనుకొన్న పనులు పూర్తి చేసామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకొని డైరీలో వ్రాసుకోవాలి.మనము సమయాన్ని ఎలా ఉపయోగించాము..మంచి పనులు ఏమి చేసాము. ఎటువంటి వృదా పనులు చేసాము అనేది విశ్లేషించుకొని, మనము రేపు ఎతున్వంటి జాగ్రత్తలు తీసుకొంటాము, మన లక్ష్యాలను చేరుకోవటానికి మనము మార్చు కోవలసిన పద్దతులను దానికొరకు మనము పాటించబోయే ఉపాయాలను ఆలోచించుకొని నిద్రకు ఉపక్రమించాలి.

1.2.9.మనము చేస్తున్న పనిలో సంపూర్ణమైన ఏకాగ్రత ఉంచి దానిలో మెళుకువలను సృజనాత్మకతను పెంచుకొంటూ కొత్త విదానాల ద్వారా తక్కువశ్రమతో ఎక్కువ ఫలితాలను సాదించే దిశగా పయనించాలి. ప్రతిరోజూ నిన్నటికంటే మెరుగైన పద్దతి లో మనము పనులు నిర్వహించగలము అని నమ్మి జీవితాన్ని గడపాలి..ఆ దిశగా అనుక్షణము ఆలోచన సాగించాలి.మనము ఎదుర్కొనే ప్రతి సమస్యను సవాళ్ళను మన చాతుర్యము తో బుద్దిబలముతో పరిష్కరించవచ్చు. మన మెదడులో సాగే ఈ ఆలోచన మనలను సృజనాత్మకత వైపు నడిపిస్తుంది విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ప్రతి పనిని మనము చేసే విదానములో చిన్న చిన్న అభివృద్ధి చేస్తూ పోయినపుడు కాలాంతరములో ఆ మార్పు ఒక గొప్ప మార్పుగా మారుతుంది.

1.2.10.మనము ఏ రంగములో అయితే ఎదుగుదాము అనుకొంటున్నామో ఆ రంగము గురించి సంపూర్ణ అవగాహన కొరకు ప్రాక్టికల్ గా ప్రయోగాలు చేస్తూ అందులో ఉన్న నిపుణులతో సంబాషిస్తూ, పుస్తకాలను చదువుతూ ఇంటర్నెట్ లో పరిశోధిస్తూ కొత్త విజ్ఞాన్ని జిజ్ఞాసతో సంపాదిస్తూ కొనసాగాలి. ఆ విదమైన అలవాట్లు మనలను మనము ఎంచుకొన్న రంగములో సుప్రసిద్ధ వ్యక్తిగా మారుస్తాయి..మనము ఎంచుకొన్న గమ్యములో ప్రయాణించి విజయాన్ని సాధించిన వ్యక్తుల గురించి మనము తెలుసుకొన్నపుడు, వారి జీవిత సత్యాలు వారు తీసుకొన్న నిర్ణయాలు మనలను ప్రభావితం చేస్తాయి..మన జీవిత గమ్యానికి మనలను సిద్దము చేస్తాయి..మనలో ఉత్సాహాన్ని కార్యదీక్షను ఏకాగ్రతను పెంపొందిస్తాయి. నిరంతరము మనము చేసే కృషి, పరిశోదన,సంబాషణ మనలో శక్తి సామర్ద్యాలను పెంచి మన మీద మనకు ఆత్మ విశ్వాసము పెంచుతుంది..అనేక విజయాలు మనలను వరిస్తాయి..మనము గురిపెట్టిన ఎటువంటి లక్ష్యాన్నైనా పూర్తి విశ్వాసం తో సాధించగలము.



1.3 జీవిత గమ్యాన్ని లక్ష్యాలుగా మార్చుకుని సాధించటం ఎలా ?



1.3.1 మన జీవితగమ్యము మనమే నిర్ణయించుకోగలుగుతాము.అది మనము చేసే పనులు, ఆలోచనలు ,విధానాలు మరియు అలవాట్లల ఫై ఆధారపడి ఉంటుంది.

1.3.2 మన జీవిత కాలములో మనము నెరవేర్చే లక్ష్యాలన్ని కలిపితే మన జీవిత గమ్యముగా మరుతుంది.అంటే మన జీవితములో మనము చేసిన పనులు , చేసిన నిర్మాణాలు,ఇచ్చిన క్రొత్త వస్తువులు, ప్రక్రియలు అన్నమాట.

1.3.3 మనకు ఏది ఇష్టమైన పని అనేది మనము నిర్ణయించుకుని ,నెరవేర్చాలనుకొన్న లక్ష్యాలను గుర్తించి మనము వాటిని సాకారము చేసుకునే దిశగా అడుగులు వేయాలి.

1.3.4 రాబోయే 2 సంవత్సరాలు 5,10,15,20,30 సంవత్సరాలలో నీవు సాధించాలనుకున్న అన్ని విషయాలను ఒక్కసారి ప్రణాళికగా మార్చుకొని వాటిని సాధించే దిశగా నిరంతరం కృషి చేయాలి. అప్పుడు మనకు జీవితగమ్యముఫై ఒక నియంత్రణ వస్తుంది.

1.3.5. ఎపుడైతే నీవు నడవాలనుకున్న మార్గము జీవితలక్ష్యాలు అర్ధమవుతాయో నీలో అనంతమైన శక్తి ప్రేరణ రావటము జరుగుతుంది.

1.3.6 నీ లక్ష్యాలను ఒక వాల్పోస్టరు లాగా మార్చుకొని వాటికి కాలపరిమితి విదించి నిరంతరం వాటిగురించే నీ ఆలోచనలు పనులు సాగినపుడు ఆ లక్ష్యాలన్నింటిని సాధించటము అనేది చాల సులభమైన మార్గము.



1.3.7.నీ ఆలోచనలు అన్నీ నీ లక్ష్యాలతో నిండిపోవాలి నీ విజయాలవెనుక రహస్యం ఏమిటని ప్రసిద్ధ శ్యాస్త్రవేత న్యూటన్ ని అడిగినప్పుడు తను అహర్నిశలు ప్రయోగాల గురించే ఆలోచించటం అని చెప్పాడు. గొప్ప వ్యక్తులంతా తమ మెదడును లక్ష్యాల వైపు మాత్రమే ఆలోచించేలా తాయారు చేస్తారు. ప్రతిరోజూ కనీసము పది నిముషాలు సమయాన్ని తీసుకొని నివు సాధించవలసిన లక్ష్యాలు సాధించినట్లుగా దర్శించాలి అప్పుడు మన లక్ష్యాల వైపు మనము పయనిస్తాము.

1.3.8. మన మీద మనము వత్తిడి పెంచుకోవాలి. లక్ష్యాలను సాధించటానికి కావలసిన సానుకూల వత్తిడిని కలిగించుకొంటూ ఉండాలి. మనము సాదించబోయే లక్ష్యాలను ఇతరులకు చెప్పటం ద్వారా వాటిని సాధించటానికి కావలసిన వత్తిడి మనకు కలిగి మనలను నడుపుతుంది.

1.3.10. నీ పనికి, లక్ష్యాలకు కావలసిన మానసిక బలాన్ని ప్రోత్సహన్నిచ్చే వ్యక్తులను సంపాదించు. వారితో నిత్యమూ నీ లక్ష్యాల గురించి వాటిలోని వొడిదుడుకుల గురించి చర్చిస్తూ ఉంటే నీకు ఆ లక్ష్యాలను సాదించగల స్పూర్తి లభిస్తుంది. వారినుండి ప్రోద్బలము, విశ్లేషణ లభిస్తాయి.ఏ పనినైన మనము క్రమము తప్పకుండా 21 రోజులు చేసినట్లయితే అది మనకు ఒక అలవాటుగా మారుతుంది ఆ తరువాత ఆ అలవాటును మనము ఆనందించటం ప్రారంబిస్తాము. అందువలన మనము మంచి అలవాట్లను ఈ సిద్దాంతం ద్వారా మన జీవితంలోకి ఆహ్వానించాలి. మన లక్ష్యాలకు సంబందించిన అలవాట్లను పెంచుకోవాలి.



1.4. జీవిత విజయాలకు మూలము క్రమశిక్షణ మరియు పట్టుదల:

1.4.1. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే మొదట అలవార్చుకోవాల్సిన లక్షణాలు క్రమశిక్షణ మరియు పట్టుదల. ఈ రెండు లక్షణాలు ఉన్నప్పుడు ఏకాగ్రత అభివృద్ధి చెంది, అనుక్షణం అభివృద్ధి సాధిస్తూ నీవనుకొన్న లక్ష్యాలను చేరుకోగల్గుతావు.

1.4.2. మనలో దాగి ఉన్న అంతర్గత శక్తి ఈ రెండు లక్షణాల ద్వారా బయటకు తీయవచ్చును. అనవసరమైన విషయాలవైపు మనము వెళ్ళకుండా ఇవి నివారిస్తాయి. మనకు స్వీయ నియంత్రణ వస్తుంది.

1.4.3. పట్టుదల అనేది మన లక్ష్యము వైపునకు మనము వెళ్ళేటట్లు చేస్తుంది. క్రమశిక్షణ అనేది మన లక్ష్యము పైన మన దృష్టి ఉంచి దానికి కట్టుబడి నమ్మకముతో కృషి చేయటాన్ని నేర్పుతుంది.

1.4.4. ఏ విషయములోనైనా విజయము సాధించటానికి మన ఏకాగ్రత మరియు నిరంతర కృషి అవసరము. క్రమశిక్షణ ఈ విషయాలను మనకు అలవాటు చేస్తుంది.

1.4.5. మొదలుపెట్టినప్పుడు ఇవి కష్టము అనిపించినప్పటికీ అలవాటుగా మారిన తరువాత నిత్య సంతోషాలను మనకు అందించి సానుకూల దృక్పధాన్ని పెంచి, నీవు పెద్ద పెద్ద విషయాలను మనము సాధించగలిగే విధముగా తయారు చేస్తాయి. అన్ని విధాల అభివృద్ధి సాధ్యం.

1.4.6. ఈ రెండు గుణాలు లేని వ్యక్తి మనసుకు బానిసై అనవసరమైన ఆలోచనలను ఆహ్వానించి దృష్టి పనికి రాని పనుల వైపు మళ్ళించబడి వినోద ప్రధానమైన కార్యక్రమాలతో తృప్తి పడి పోతాడు. మహాత్మా గాంధీ, వివేకానంద, మదర్ తెరెసా, హెలెన్ కెల్లెర్ ... జీవితాలను గమనిస్తే వారు క్రమశిక్షణ మరియు పట్టుదల ఎలా వాడారో తెలుస్తుంది. వారి విజయానికి ఇవే కారణాలు.

1.4.7. బయట ప్రపంచములో విజయాన్ని సాధించాలంటే మనము ముందు మన మనసులో సాధించాలి. మనలను మనం తక్కువ అంచనా వేసుకుంటే ఏ విజయాన్ని సాధించలేము.

1.4.8. మన పట్టుదలను నిశ్చలముగా ఉంచుకోవటం అభ్యాసం చేస్తే ఎటువంటి కలనైనా సాధించగలము. మన ఏకాగ్రతతో మన లక్ష్యం వైపు ఒక గురి పెట్టిన బాణం లాగా ఉన్నప్పుడు మన లక్ష్యమును తప్పక సాధించగలుగుతాము.

1.4.9. క్రమశిక్షణ, పట్టుదల అనే లక్షణాలు ప్రతి మనిషిలోను అంతర్గతముగా దాగి ఉంటాయి. వాటిని నిరంతర సాధన ద్వారా బయటకు తీయవచ్చును. ఒక సారి వాటిని వాడటం మొదలు పెట్టిన తర్వాత అవి క్రమ క్రమముగా బలము గా మారి గొప్ప విజయాలను సాధించటానికి మనిషిని నడిపిస్తాయి. వీటి వలన తన లక్ష్యము ఎంత కఠిన మైనను దానిని సాధించటానికి నిరంతర ప్రయత్నం చేస్తాడు.

1.4.10. మనలో అంతర్గతంగా ఉండే భయాలు, ఆందోళనలు, నిరర్ధకమైన ఆలోచనలు మన శక్తిని తగ్గిస్తూ ఉంటాయి. కానీ ఈ రెండు లక్షణాలు ఆ బలహీనతల నుండి మనలను రక్షించి గొప్ప విజయాలు సాధించే విధముగా చేస్తాయి.

1.4.11. మనము చాలా విషయాలు సాధించాలి అని అనుకుంటాము. కానీ మనము సాధించాలి అనుకున్న విషయము ఫై ఇష్టాన్ని పెంచుకోము. దాని వలన ఆ పని మనకు ఇబ్బంది గా అనిపిస్తుంది. మనము అలసిపోయినట్లుగా అయిపోతాము. ఈ స్థితి నుండి బయటకు వచ్చినప్పుడు మనము అనుకున్న విషయాలను తప్పక సాధిస్తాము. ఈ రెండు లక్షణాలు అందుకు సహాయం చేస్తాయి.

1.4.12. మనకు జీవితంలో నిజమైన ఆనందం లక్ష్యాలను చేసుకుని వాటిని సాధించటం ద్వారానే వస్తుంది. మన జీవిత చివరి దశలో మనము వెనుకకి తిరిగి చూస్తే మనము సాధించిన విజయాలే మనకు ఆనందాన్ని ఇస్తాయి. విజయము అంటే డబ్బు సంపాదన కాదు. మానసిక శాంతి, అన్ని విధాల అభివృద్ధి చెందిన వ్యక్తిత్వం. క్రమశిక్షణ మరియు పట్టుదలలు మనిషిని తన లక్ష్యాలు సాధించే విధముగా నడిపించి, ప్రోత్సహించి, ప్రేరేపించి మరియు స్ఫూర్తినిచ్చి విజయాలు సాధించే విధముగా తయారు చేస్తాయి.